
భువనేశ్వర్: భారతదేశానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి (శాండ్ ఆర్టిస్ట్), పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. రష్యాలోని కలినిన్‌గ్రాడ్ ప్రాంతంలో జరిగిన 'II ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ శాండ్ స్కల్ప్చర్' (రెండవ అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఉత్సవం)లో ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026'ను కైవసం చేసుకున్నారు. ఈ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు.
గ్లోబల్ వార్మింగ్‌పై అద్భుత శిల్పం
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న 'గ్లోబల్ వార్మింగ్' (భూతాపం), పర్యావరణ మార్పుల వంటి తీవ్రమైన సమస్యలను ప్రతిబింబిస్తూ సుదర్శన్ పట్నాయక్ చెక్కిన 3 మీటర్ల ఎత్తైన ఇసుక శిల్పానికి ఈ అవార్డు లభించింది. ఈ శిల్పంలో ఆయన భూమి యొక్క రెండు భిన్నమైన రూపాలను చూపించారు. ఒకవైపు పర్యావరణ క్షీణత, కరవుతో దెబ్బతిన్న భూమిని చూపించగా.. మరోవైపు చెట్లను నాటడం ద్వారా పచ్చదనంతో కళకళలాడుతూ, జీవవైవిధ్యంతో నిండిన భూమిని ఎంతో అద్భుతంగా ఇసుకపై ఆవిష్కరించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో , పర్యావరణాన్ని రక్షించడంలో చెట్ల ప్రాముఖ్యతను ఈ శిల్పం చాటిచెప్పింది.
జ్యూరీ ఏకగ్రీవ నిర్ణయం
ఈ అంతర్జాతీయ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 మంది ప్రముఖ ఇసుక శిల్పులు పాల్గొన్నారు. అయితే, కళాత్మక నైపుణ్యంతో పాటు సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించిన సుదర్శన్ పట్నాయక్ శిల్పాన్ని అక్కడి నిర్వాహక జ్యూరీ కమిటీ ఏకగ్రీవంగా విజేతగా ఎంపిక చేసింది. ఉత్సవ ప్రారంభ వేడుకల్లో భాగంగా జనరల్ డైరెక్టర్ అలీనా అలెక్సాండ్రోవ్నా.. ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో పట్నాయక్‌కు ఈ 'గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్' పతకాన్ని అందించి గౌరవించారు.
గర్వంగా ఉందన్న సుదర్శన్ పట్నాయక్
ఈ చారిత్రాత్మక విజయంపై సుదర్శన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాండ్ ఆర్టిస్ట్‌గా నిలవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన నిర్వాహకులకు, జ్యూరీ సభ్యులకు , అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సామాజిక, పర్యావరణ మరియు దేశభక్తి అంశాలపై ఇసుక శిల్పాలను చెక్కుతూ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ పట్నాయక్ సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.