మహిళా సమన్వయం - సంఘ్ ప్రేరేపిత సంస్థల్లో సమన్వయం

VSK Telangana    16-Jun-2026
Total Views |
 
SANGH
 
సంఘ ప్రేరేపిత సంస్థలలో పనిచేసే మహిళల పట్ల కొన్నేళ్లుగా శ్రద్ధ బాగా పెరిగింది. ఆయా సంస్థల్లో పనిచేసే మహిళల మధ్య సమన్వయం, నాయకత్వ లక్షణాలు పెంపొందే విషయంలో సంఘ్ ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. 2009 లో ‘‘మహిళా సమన్వయ్’’ ప్రారంభమైనప్పుడు గీతాతాయిని ఏబీవీపీ బాధ్యత నుంచి తప్పించి, ఈ పని కోసం పంపించారు. సంఘ మార్గదర్శనంలో సంఘ ప్రేరేపిత సంస్థల్లో మహిళా భాగస్వామ్యం పెంచేలా చూడటం వారి పని.
 
వివిధ సంఘ ప్రేరేపిత సంస్థల పెద్దలకు సలహాలు, సూచనలివ్వడం, విద్యార్థినుల కోసం వర్క్ షాప్స్ నిర్వహించడం, ఆయా ప్రేరేపిత సంస్థల్లోని ప్రముఖ మహిళా కార్యకర్తలతో వార్షిక సమావేశాలు నిర్వహించి, ముఖ్యమైన సమస్యలు గుర్తించడం, సంఘ మహిళా కార్యక్రమాలకు ఎజెండా సిద్ధం చేయడం వంటివి వారి ముఖ్య విధులు.
 
‘‘మహిళా సమన్వయ్’’ లో గీత తాయితో కలిసి ఓ మహిళా బృందం కూడా వుండేది. ఏబీవీపీ నుంచి మమతా యాదవ్, బీఎంఎస్ నుంచి గీతా గోఖలే, వీహెచ్ పీ నుంచి శ్రీమతి మీనాక్షి, వీకేఏ నుంచి రంజనా ఖరే వీరిలో ప్రముఖులు.1990 లోనే మహిళా సమన్వయ్ మహారాష్ట్రలో ప్రారంభమైంది. అఖిల భారత స్థాయిలో 1993 లో ప్రారంభమైంది. దానికి గీతా తాయి నేతృత్వం వహించారు. 2000 లో పూణె కేంద్రంగా ‘‘దృష్టి’’ పేరుతో మహిళా సమస్యల అధ్యయన సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం అంజలీ పాండే దీనికి నేతృత్వం.
 
ఈ పని ప్రభావాన్ని చాలా సంఘ ప్రేరేపిత సంస్థలు సునిశితంగా పరిశీలించాయి. న్యాయవాదుల సంస్థ ‘‘అధివక్త పరిషత్’’ మహిళలకు వుండే న్యాయపరమైన హక్కులపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మహిళా అథ్లెట్లకు, క్రీడాకారులకు సౌకర్యాలు పెంచాలంటూ ‘‘క్రీడా భారతి’’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. భారతీయ మహిళా మణుల చరిత్ర గురించి, మహిళా చరిత్రకారులపై ‘‘ఇతిహాస సంకలన సమితి’’ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. 2017 లో బీఎంఎస్ ఢిల్లీలో 2 లక్షల మందితో ప్రదర్శన చేపట్టగా, అందులో లక్ష మంది మహిళా కార్యకర్తలున్నారు.
 
వనవాసీ కల్యాణాశ్రమంలో, సంస్కృత భారతిలో ఎంతో మంది మహిళలు పూర్తి సమయ కార్యకర్తలున్నారు.
2010 లో ‘‘మహిళా విమర్శ్’’ (మహిళా సమస్యల అధ్యయనం) పేరుతో సంఘం ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సరసంఘచాలక్ హాజరయ్యారు. అలాగే మహిళా సమన్వయ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో 2019 మార్చి 23,24 తేదీలలో రెండు రోజుల పాటు ‘‘భారతీయ స్త్రీ విమర్శ్’’ పేరుతో సమ్మేళనం జరిగింది. ప్రస్తుత కాల సమస్యలు హిందూ ఆలోచనల ఆధారంగా, కుటుంబ వ్యవస్థల ఆధారంగా ఎలా పరిష్కరించవచ్చు? అన్న దానిపై ఈ సమ్మేళనం దృష్టి నిలిపింది. ప్రస్తుతం కూడా సంఘ్ లో ఈ విస్తృతమైన చర్చ జరుగుతోంది.
 
 
సంఘ్ స్ఫూర్తితో ఎన్నో మహిళా సంస్థలు ఏర్పడ్డాయి. పూణే కేంద్రంగా స్త్రీశక్తి జాగరణ్, నాగపూర్ కేంద్రంగా ‘‘మైత్రేయి’’ వంటి సంస్థలు పురుడు పోసుకున్నాయి. అంతిమంగా ముంబై కేంద్రంగా అఖిల భారతీయ స్థాయిలో ‘‘స్త్రీశక్తి’’ పేరుతో ఒకే వేదిక ఏర్పాటు కావడంతో ఈ సంస్థలన్నీ ఆ పేరుతోనే పనిచేస్తున్నాయి. దీనిని ఊర్మిళ ఆప్టే ప్రారంభించారు. ఈ వేదిక వేర్వేరు ప్రదేశాల్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
 
కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థినుల కోసం ‘‘వివాహ్ కీ పాఠశాల’’ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించారు.తరుచుగా అమ్మాయిలు వివాహం తర్వాత ఎదుర్కునే సమస్యలను అధిగమించాలన్న ఉద్దేశంతో వివాహమనేది ఓ మంచి నిర్ణయంగా వుండాలని రూపొందించారు. గృహహింస, విడాకులు తదితర అకృత్యాలన్నింటినీ నిరోధించడంలో ఈ కార్యక్రమం సఫలమవుతోంది. పురుషులు సహజంగా ప్రదర్శించే ఆధిపత్య ధోరణిని ప్రదర్శించవద్దు. హింసకు వారి ఆలోచనలో గానీ, మాటలలో గానీ, చేతలలో గానీ ఆస్కారం ఇవ్వొద్దంటూ పురుషులకూ విలువలు బోధిస్తోంది.
 
అలాగే ఓ సిలబస్ ప్రత్యేకంగా రూపొందించిన ‘‘స్త్రీ శక్తి’’ దీని కోసం వైద్య నిపుణులను కూడా నియమించింది. మహిళా, స్త్రీ సంక్షేమ శాఖ ‘‘స్త్రీ శక్తి’’ ని అధికారికంగా గుర్తించి, విశాఖ గైడ్ లైన్స్, నిర్భయ ఫండ్’’ లాంటి సందర్భాలలో మహిళా గౌరవం, భద్రత వంటి వివిధ విషయాలపై సూచనలు కోరుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు కేరళకు చెందిన జయశ్రీ అధ్యక్షురాలిగా, మహారాష్ట్రకు చెందిన కుముదిని భార్గవ్ ప్రధాన కార్యదర్శిగా, మనీషా కొఠేకర్ సంఘటనా కార్యదర్శిగా వున్నారు.