
వలసవాద పాలన గుర్తులను తొలగించే జాతీయ చొరవలో భాగంగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని 21 బ్రిటిష్ కాలం నాటి రోడ్లు, నాలుగు బజార్ల పేర్లను మారుస్తూ బోర్డు ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్. రాజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది. ఈ మార్గాలకు మన దేశ సార్వభౌమాధికారం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లు, జాతీయ నాయకులు, దేశ గమనాన్ని మార్చిన మహనీయుల పేర్లను ఖరారు చేశారు.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ నూతన పేర్లు ఏంటంటే...
వీర జవాన్ల స్మృత్యర్థం మారిన ప్రధాన మార్గాలు
దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరుల గౌరవార్థం కీలక రోడ్ల పేర్లను మార్చారు. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరును పూర్వపు 'వెల్లింగ్టన్ రోడ్డు'కు (విక్రమ్ బాత్రా మార్గ్) పెట్టారు.గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణ అధికారి కల్నల్ సంతోష్ బాబు పేరును 'బర్టన్ రోడ్డు'కు (సంతోష్ బాబు రోడ్డు) ఖరారు చేశారు. ఇక ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరును 'రిచర్డ్‌సన్ రోడ్డు'కు (ఉన్నికృష్ణన్ మార్గ్) నామకరణం చేశారు.భారత సైన్యంలో మొదటి పరమవీర చక్ర గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ పేరును 'గఫ్ రోడ్డు'కు (సోమనాథ్ శర్మ మార్గ్) కేటాయించారు.
జాతీయ నాయకులు, మహనీయుల నామకరణాలు
వలస పాలకుల పేర్ల స్థానంలో భారత గమనాన్ని మార్చిన అమరవీరులు, జాతీయ చిహ్నాలు, ప్రముఖ వ్యక్తుల పేర్లను బోర్డు ఖరారు చేసింది. 'బోల్టన్ రోడ్డు'ను మాజీ ప్రధానమంత్రి గౌరవార్థం అటల్ బిహారీ వాజ్‌పేయి రోడ్డుగా మార్చారు. 'నోబెల్ రోడ్డు'కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డు అని పేరు పెట్టారు. 'లిట్టన్ రోడ్డు' ఇకపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డుగా, 'కార్న్‌వాలిస్ రోడ్డు' రూపాంతరం చెంది స్వామి వివేకానంద మార్గ్గా పిలవబడతాయి. 'బైమ్ రోడ్డు'ను పరమహంస మార్గ్గా, 'ఎంపరెస్ రోడ్డు'ను వీరనారుల గౌరవార్థం వీర నారి మార్గ్గా మార్చారు.
సైనిక వారసత్వం ప్రతిబింబించేలా బజార్ల పేర్ల మార్పు
రోడ్లతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని నాలుగు బజార్ ప్రాంతాల పేర్లను కూడా సైనిక వైభవాన్ని, స్థానిక గుర్తింపును ప్రతిబింబించేలా మార్చారు. ఇక '108 బజార్'ను ఇకపై ఇన్‌ఫాంట్రీ బజార్గా పిలుస్తారు. 'ఆర్ఏ పెన్షనర్స్ లైన్స్' పేరును ఆర్టిలరీ పెన్షనర్స్ లైన్స్గా మార్చారు. 'బేరర్స్ లైన్స్' ప్రాంతానికి కర్తవ్య నగర్ అని, 'హేర్ రోడ్డు'కు తాడ్‌బండ్ టెంపుల్ రోడ్డు అని కొత్త పేర్లు పెట్టారు.
బానిసత్వపు ఆనవాళ్లను తొలగించి, భావితరాలకు భారతీయ వీరుల త్యాగాలను గుర్తుచేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ నూతన బోర్డులను నెల రోజుల్లోగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.