శాఖలో ‘‘ఏకశ: సంపత’’ అన్న ఆజ్ఞ ఆంతర్యం ఇదే...

VSK Telangana    22-Jun-2026
Total Views |
 
SAMPATHA
 
సంఘ శాఖలో ముఖ్య శిక్షక్ ‘‘ఏకశ: సంపత’’ అని అంటుంటాడు. అసలు దీని ఆంతర్యం ఏమిటి? ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఏకశ: సంపత అనగానే అందరూ ఒకే వరుసలో నిలబడతారు. డిగ్రీగానీ, హోదా కానీ, కులంగానీ ఎవ్వరికీ పట్టదు. శిబిరంలో అందరూ కలిసి భోజనం చేస్తారు. పక్కన ఎవరు కూర్చున్నారో స్వయంసేవకులు పట్టించుకుంటారా? పట్టించుకోకపోవడమే సంఘ్ ప్రత్యేకత. అదే ఏకశ: సంపత.
ఏకశ: సంపత అనే భావం నుంచి ఈ శిక్షణ నుంచి మన మనస్సులకు ఎన్నెన్నో భావాలు తడతాయి. ఆరెస్సెస్ తృతీయ సర్ సంఘచాలక్ బాలా సాహెబ్ దేవరస్ ఒకసారి ఓ ఉదాహరణను ఉటంకించారు.
 
ఒకసారి వారు యూపీలోని గోండా జిల్లా పర్యటనకు వెళ్లారు. అప్పుడు స్వయంసేవకులలో ఒకరైన నానాజీ దేశ్ ముఖ్ ఆ జిల్లా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అక్కడి ప్రజల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి వచ్చారు. అక్కడికి బాలా సాహేబ్ దేవరస్ కూడా వెళ్లారు. ఆ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే.. ఆ రోజు భోజనాల సమయంలో రాష్ట్రపతి పేద రైతుల పక్కనే కూర్చొన్నారు. బాలా సాహెబ్ జీ కూడా అదే వరుసలో భోజనం చేశారు. రాష్ట్రపతికి అటు ఇటు వైపున నేలపైన పట్టాలపై ఒక పేద రైతు, అటు వైపు మరో రైతు, వారి పక్కన బాలాసాహెబ్... ఆ ప్రకారం గానే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులూ కూర్చొన్నారు. అంతా విస్తళ్లల్లోనే భోజనం చేశారు. అక్కడి అలవాటును అనుసరించి చిన్న చిన్న మట్టి పిడతలతో పప్పుకూర, మంచి నీళ్లు యిచ్చారు. రాష్ట్రపతిని అలా భోజనం చేయడానికి ఆహ్వానించే చొరవ, చనువు ఒక్క సంఘ స్వయంసేవకులకు తప్ప, మరెవ్వరికీ వుండదేమో. నిజానికి ఇలా భోజనం చేయడం స్వయంసేవకులకు అలవాటే.
 
ఏకశ: సంపత సంఘానికి ఓ లాంఛనం కాదు. కేవలం ఆజ్ఞ మాత్రమే కాదు. అంతా ఒకే వరుసలో నిలవటం అనే సమతా భావన, సోదర భావన. ఏకతా భావన అన్న ఉద్దేశం దాని వెనకాల వుంది. సంఘ స్థాన్ లో, శిబిరాల్లో, శిక్షావర్గల్లో, స్వయంసేవకులు అంతా ఒకటిగా వుంటూ, ఆ ఏకత్వం వ్యక్తిలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ రావాలి. ఆచరణలో పెట్టాలి. ఏ కులం వ్యక్తి స్వయంసేవకుని ఇంటికి వచ్చినా.. సహపంక్తి భోజనమే చేస్తారు. సంఘ శాఖలో పొందిన సంస్కారాలను స్వయంసేవకులు ఇలా ఆచరణలో పెడతారు.