వామపక్ష విషవృక్షం ('విషైలీ వామపంథ్') - రచన: డాక్టర్ రాజీవ్ మిశ్రా
తెలుగు అనువాదం: హైందవి - ప్రచురణ: సంవిత్ ప్రకాశన్
పుస్తక సమీక్ష: శ్రీ ఖండవల్లి కేశవనాథ్
'యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడు కాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్థం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే' అనే మాటలు బెట్రాండ్ రస్సెల్ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు. నిజమే. ఉడుకురక్తం, ఆదర్శవాదం ఉండే యువతలో అన్యాయం, అసమానతలు, అక్రమాలను పూర్తిగా రూపుమాపేయాలన్న ఆవేశం, ఆవేగం ఉంటాయి. ఆ సమయంలో పీడిత, తాడిత, వెనుకబడిన, పేద ప్రజానీకానికి మేలు చేయడానికి 'ఉద్యమించాల'నే కమ్యూనిస్టు... అదే వామపక్షవాద సిద్ధాంతం.. చాలా ఆదర్శవంతంగా, ఆచరణీయంగా, అనుసరణనీయంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ 'ఉద్యమ' స్ఫూర్తి ఎంత తీవ్రంగా ఉంటే అంత వామపక్షవాదం తలకెక్కుతుంది. విచక్షణ, వివేచన మాయమవుతాయి. సాటి మనిషిని చంపడం కూడా ఉద్యమమే అన్న దుస్థితి దాపురిస్తుంది. ప్రకృతిలో భిన్నత్వం, వివిధత్వం సహజం. ఆ వైవిధ్యం లేకపోతే జీవనచక్రం ముందుకు సాగదు. అయితే ఈ భిన్నత్వం, వైవిధ్యం అణచివేత, అక్రమం, అన్యాయానికి దారితీయకుండా నియంత్రించేదే 'ధర్మం'. ధర్మం అనే భావన ప్రపంచానికి ఇచ్చినది భారతదేశం మాత్రమే. సర్వసృష్టి పరమాత్మ స్వరూపమని, అందుకే ఆ సృష్టి క్రమాన్ని, వ్యవస్థను అతిక్రమించకుండా జీవించడమే ధర్మమని మన ఋషులు బోధించారు. ఆ పరమాత్మభావన, ధార్మికభావన లేని పాశ్చాత్య ప్రపంచంలో పుట్టిన కమ్యూనిజం పైకి అన్యాయం, అక్రమం, అణచివేతలపై పోరాటం చేస్తున్నట్లు కనిపించినా, చివరికి అటువైపుకే దారితీస్తుందని చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపించాయి. పీడిత, తాడిత, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని బయలుదేరిన నానారకాల కమ్యూనిస్టులు చివరికి పెట్టుబడిదారీ, బూర్జువా ప్రతినిధులుగా మారిపోవడానికి కారణం ఈ ధార్మికభావన లేకపోవడమే. కాబట్టి కమ్యూనిజం అనేది కేవలం ఒక రాజకీయ భావన, వ్యవస్థకాదని, అది పెడధోరణి, వక్రమార్గమని స్పష్టమవుతుంది. 'ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడ ఉంది? అది ఎప్పుడో అంతరించిపోయింది' అని అనుకోవడం పొరపాటని అర్ధమవుతుంది. కమ్యూనిస్టు పాలన, కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ అంతంకావచ్చునుకానీ, ఆ పెడధోరణి, వక్రీకరణ మనస్తత్వం, ఆలోచన ఎక్కడికీ పోలేదు. ఇప్పటికీ అందరి మనస్సులను కలుషితం చేస్తూనే ఉంది. ఉద్యమాల పేరుతో 'రోడ్డున' పడేస్తూనే ఉంది. ఇదే విషయాన్ని డాక్టర్ రాజీవ్ మిశ్రా తన 'విషైలీ వామపంథ్'... తెలుగులో 'వామపక్ష విషవృక్షం'.. అనే ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు.
కమ్యూనిస్టు ఆలోచనా ధోరణి కనిపించని శత్రువు అని వివరించే 'వామపక్షవాదం చీకట్లో శత్రువు' అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ పుస్తకం 'వామపక్షవాదం స్వరూపం మార్చుకునే వైరస్' అనే అధ్యాయంతో ముగుస్తుంది. ఈ రెండు అధ్యాయాల మధ్యలో వామపక్షవాదపు ప్రయాణం, వివిధ దేశాల, సమాజాల మేధోపరమైన, ఆర్థికపరమైన వనరులను ఉపయోగించుకుని ఆ సమాజాలనే అధోగతికి చేర్చిన తీరు చాలా చక్కగా వివరించారు. సైద్ధాంతిక చర్చ కాకుండా ప్రత్యక్ష ఉదాహరణలు, చరిత్రలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని వామపక్షవాదం ఎలాంటి విషవృక్షమో వివరించారు. ఆ విషవృక్షపు వేరులు ఎంత బలంగా పాతుకుపోయాయో, ఎంతవరకూ విస్తరించాయో అర్థమవుతుంది. వోకిజం, జండర్ ఈక్వాలిటీ, పొలిటికల్ కరెర్ట్నెస్, సెక్యులరిజం, మైనారిటీయిజం వంటి ఆధునిక జాడ్యాలన్నింటి మూలస్థానం కమ్యూనిజమేనని స్పష్టమవుతుంది. ఉదాహరణలు, సంఘటనల ద్వారా వివరించడంవల్ల ఈ పుస్తకంలో చెప్పిన విషయం ఎప్పుడోఒకప్పుడు, ఏదోఒకరూపంలో మన అనుభవానికి వచ్చినదేనని తెలుస్తుంది. నిత్యజీవితాలను, మన ఆలోచనలను వామపక్ష విషవృక్షపు గాలులు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆదర్శవాదంతో తొణికిసలాడే యువత ఈ గాలుల తాకిడికి గురై నిర్వీర్యం, నిస్తేజంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఆ ప్రమాదం నుండి కాపాడటానికి ఎక్కువమంది యువతతో ఈ పుస్తకం చదివించాలి.
రచయిత డాక్టర్ రాజీవ్ మిశ్రా మాటల్లో..
తాత్త్వికమైన పాండిత్యం, చారిత్రక కచ్చితత్వం, సాహితీ సౌందర్యం లేని ఈ పుస్తకపు సైద్ధాంతిక నిజాయితీ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకం నా స్వంత ఆలోచనలతో వ్రాశాను. ప్రపంచం ఎలా కనబడిందో, అర్థమయిందో అలాగే వ్రాశాను. దీనిలో లోతైన జ్ఞానము, రాజకీయ నిబద్ధత అనే మసాలాలు కలపలేదు. ఇది విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేస్తున్న మేధావులు, మీడియాలో జ్ఞానాన్ని పంచే తెలివిపరుల కోసం కాదు. ఇది మనలాంటి వాళ్ళ కోసం. దీనిలో రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది. రేపటి సమాజం గురించిన ఆలోచన ఉంది. ఇందులో ఉన్నది సత్యం పట్ల నిష్ఠతో, సాధారణ తెలివితో ఆలోచించి, మీ ముందుంచిన విషయం.