ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు

VSK Telangana    03-Jun-2026
Total Views |
 
madrs hc
 
మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను హైకోర్టు రద్దు చేసింది.ఈ విజయ దశమి ఉత్సవం వల్ల ప్రజలకు అంతరాయం కలిగిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
 
అంబూరులోని అదనపు జిల్లా మున్సిఫ్-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ, వి. జయపాల్ తదితరుల నేతృత్వంలోని RSS సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ ఎం. నిర్మల్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
 
పిటిషనర్ల తరపున న్యాయవాది డి. విజయ బాబు హాజరుకాగా, రాష్ట్రం తరపున అదనపు ప్రభుత్వ న్యాయవాది లియోనార్డ్ అరుణ్ జోసెఫ్ సెల్వం హాజరయ్యారు.
 
మరో వైపు పోలీసు అధికారుల ప్రకారం.. అక్టోబర్ 2,2025 న సంఘ కార్య శతాబ్ది విజయ దశమి ఉత్సవాలను జరుపుకునేందుకు స్వయంసేవకులు ఆరెస్సెస్ జెండాలతో అంబూరులో సమావేశమయ్యారని, ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అనుమతి లేకుండా నిర్వహించారని, దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఫిర్యాదులో ఆరోపించారు.గ్రామ పరిపాలనా అధికారి (VAO) అయిన ఎం. దినకరన్ ఫిర్యాదు మేరకు, అంబూరు పట్టణ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని వివిధ నిబంధనల కింద ఒక కేసును నమోదు చేశారు.
 
-source - organiser