ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వ కుట్ర
దయనీయ స్థితిలో పాఠశాల విద్య
రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ బడుల మూసివేత కుట్ర
కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వ వత్తాసు
నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ యూనివర్సిటీలు
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫ్లాప్
తెలంగాణలో జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ పథకానికి ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు విమర్శించారు. పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అడిగితే దొడ్డి దారిన జీవో నెంబర్ 7ని తీసుకొచ్చి నేరుగా విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, మరి బకాయిల సంగతేందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో జూన్ 09న ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ TAFRC ప్రైవేట్ కళాశాలతో కుమ్మక్కై ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరిచిందని, దీనివల్ల పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు.ఇంటర్మీడియట్ విద్యలో ఫీజు నియంత్రణ లేని కారణంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇష్టారీతిన లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నాయని,అనుమతులు లేకుండా కళాశాలలు నడుస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మౌలిక వస్తువులు లేక పుస్తకాలు లేక చదువు చెప్పడానికి అధ్యాపకులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. అనేక సమస్యలతో పాఠశాల విద్య అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదన్నారు. రేషనలైజేషన్ పేరుతో బడులను మూసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం హామీనిచ్చినట్లుగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా మాఫియాకు కళ్ళెం వేయాలని లేకపోతే విద్యార్థి సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఒకవైపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు రోడ్డు ఎక్కుతుంటే, అలాంటి పాఠశాలలపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలను మూసివేసి నిర్వాహకులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని, కనీసం విద్యార్థులకు సరైన టాయిలెట్ వసతి కూడా లేక ఇబ్బందులు పడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు.
స్కూల్ విద్యార్థులకు పాఠశాల ప్రారంభం అయిన రోజునే పాఠ్యపుస్తకాలు,యూనిఫాం అందించేలా చర్యలు తీసుకోవాలని, జీరో ఎన్రోల్మెంట్ లేకుండా పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్యను పెంచడం కోసం చర్యలకు పూనుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి.అదేవిధంగా పాఠశాల విద్యలో కీలకమైన మండల, జిల్లా విద్యాధికారులను (MEO, DEO) నియమించాలని ABVP డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నీతూ సింగ్, సిటీ సెక్రెటరీ పృథ్వీతేజ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, శ్యామ్ కిరణ్, మహేష్ పాల్గొన్నారు.