భాగ్యనగర్ (హైదరాబాద్)లోని దూద్ బౌలిలో ఉన్న శాంతినికేతన్ పాఠశాలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సంతాప సభను నిర్వహించారు. ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ ఫొటోలు చేతబట్టి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు ఇరాన్ జాతీయ జెండాలను కూడా నిర్వాహకులు పంపిణీ చేశారు. వీటిని వ్యతిరేకిస్తూ బీజేపీ, బీజేవైఎం పాఠశాల ముందు నిరసనకు దిగారు. నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సదరు పాఠశాల యాజమాన్యం ఇదంతా తమకు తెలియకుండా జరిగిపోయిందంటూ ఒక కంటి తుడుపు ప్రకటన విడుదల చేసింది.
అసలేం జరిగిందంటే...
పాఠశాల ఆవరణలో జులై 8వ తేదీన ఉదయం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ (NGO) ప్రతినిధులు వచ్చారు. ఉదయం 8:55 గంటలకు ఆ సంస్థ ప్రతినిధి, యునెస్కో (UNESCO) ధృవీకరించిన దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక బాలికల ప్రాథమిక పాఠశాలలో అమెరికా దాడుల కారణంగా చనిపోయిన పిల్లల అంత్యక్రియల సందర్భాన్ని పురస్కరించుకుని "మానవత్వం - ప్రపంచ శాంతి" అనే అంశంపై మాట్లాడటానికి అనుమతి కోరారు. అయితే.. మంచి అంశం అని అనిపించడంతో 2 నిమిషాలకు మాత్రమే అనుమతిని ఇచ్చామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
కాగా, ఆ సంస్థ ప్రతినిధులు మానవత్వం, ప్రపంచ శాంతితో పాటు భారత్, ఇరాన్ మధ్య గల చారిత్రక సామాజిక సాంస్కృతిక సంబంధాల గురించి కూడా చెప్పారు.
అయితే.. ఈ సమావేశంలో ఇరాన్‌కి చెందిన పోస్టర్లను గానీ, పేపర్ జెండాలను ఉపయోస్తామని సంస్థ ఎక్కడా చెప్పలేదు. అంతేకాకుండా వాటిని తమ పాఠశాల యాజమాన్యం ముందుగా కొనుగోలు చేయలేదని కూడా పాఠశాల పేర్కొంది. అంతేకాకుండా పాఠశాల ప్రిన్సిపాల్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాట్లలో వుండటంతో, ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ కి తెలియలేదని, తెలుసుకునే లోపే ప్రసంగం ముగించారని పాఠశాల పేర్కొంది.
ఇది మానవత్వ కోణంలో ఉందని భావించి తాము ఆ సంస్థకు అనుమతి ఇచ్చామని, కానీ కొందరు దీనిని వక్రీకరిస్తున్నారని పాఠశాల అభ్యంతరం తెలిపింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అసలు పాఠశాలలో ఏం జరిగిందో కూడా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా నోటీసు బోర్డులో పెట్టామని పాఠశాల యాజమాన్యం అంటోంది.
అయితే... ఇంత కీలకమైన, పెద్ద సమావేశం జరుగుతున్న సమయంలో పాఠశాల యాజమాన్యం ఏమరు పాటుగా వుంటుందా? వారికి తెలియని స్వచ్ఛంద సంస్థలు వచ్చి, కార్యక్రమం నిర్వహించుకుంటామని చెబితే, ఏమీ పరిశీలించకుండానే అంగీకారం చెప్పేస్తారా? అంటూ జాతీయవాదులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.