ఉర్దూ పాఠాలు బోధించిన ఆర్మూర్ భరత్ చంద్ర స్కూల్ ను ప్రభుత్వం సీజ్ చేసింది. ఇకపై పాఠశాలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఉర్దూ పాఠాలు బోధిస్తున్నారని, నమాజ్ చేయిస్తున్నారని తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆరోపిస్తూ, ఫిర్యాదు చేశాయి. దీంతో అధికారులు విచారణ నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తోందని విద్యాశాఖ వెల్లడించింది. దీంతో పాఠశాలను సీజ్ చేసింది. విద్యార్థుల అకాడమిక్ భవిష్యత్తు దృష్ట్యా పిల్లల్ని సర్కార్ బడిలో చేర్పించాలని సూచించారు.
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాఠాలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) కూడా చెప్పిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో హిందూ సంఘాలు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసనకు దిగారు. భరత్ చంద్ర పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అమీర్ ఖాన్ పర్యవేక్షణలోనే ఉపాధ్యాయురాలు ఆలీమా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఉర్దూ పాఠాలు కూడా నేర్పుతున్నారు.
ఈ విషయం రూఢీ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల లోపలికి దూసుకెళ్లి, ప్రిన్సిపాల్ పై దాడికి దిగారు. తమ పిల్లలకు ఉర్దూ పాఠాలు, కల్మా నేర్పుతున్నారని, వారి పుస్తకాల్లో ఉర్దూ రాతలు కూడా వున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
కొంత మంది పిల్లల్ని స్కూల్ దశ నుంచి ఇతర మతాల్లోకి వెళ్లేలా వారిలో చెడు భావనలను నింపుతున్నారని, లవ్ జిహాద్ వైపు వెళ్లేలా వారిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఇప్పటికే ఎంఈవో, స్థానిక ఎమ్మార్వో సైతం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. మరోవైపు అనుమతిలేనిదే స్కూల్‌లో ఉర్దు బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు.