ఈ - రిక్షాలను ఇబ్బంది పెడుతున్న చైనా యాప్ లను నిషేధించిన కేంద్రం

VSK Telangana    03-Jul-2026
Total Views |
 
app
 
న్యూఢిల్లీ :  చైనా మొబైల్ యాప్ లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఢిల్లీో ఈ – రిక్షాలను రిమోట్ ద్వారా ఆపేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న మొబైల్ యాప్ లను కేంద్రం నిషేధించింది. వీటిని గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ – రిక్షాలను నడిరోడ్డుపై షట్ డౌన్ చేస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ యాప్స్ ను తొలగించింది.
 
ఈ రెండు యాప్‌లు బ్లూటూత్ ద్వారా లిథియం-అయాన్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతాయి. బ్యాటరీ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించినప్పటికీ కొందరు వీటిని ఈ-రిక్షాల పవర్‌ను దూరం నుంచే నిలిపివేయడానికి ఉపయోగిస్తున్నారు. యాప్‌లోని డిశ్చార్జ్ స్విచ్ నొక్కగానే వాహనం ఒక్కసారిగా ఆగిపోతోంది.
 
చాలా ఈ-రిక్షాల్లో ఉపయోగించే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లలో పాస్‌వర్డ్‌, ఇతర భద్రతా ధ్రువీకరణ లేకపోవడమే ఈ సమస్యకు కారణమని అధికారులు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న ఎవరైనా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి వాహనాన్ని నిలిపివేయగలుగుతున్నారు. తిరిగి అదే యాప్ ద్వారా ఆన్ చేస్తేనే వాహనం మళ్లీ పనిచేస్తోంది.
 
ఇలాంటి ప్రమాదకర యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో కూడా ప్రజల భద్రతకు ముప్పుగా మారే యాప్‌లను గుర్తించి యాప్ స్టోర్ల నుంచి తొలగించే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.