‘‘సముద్ర మంథన్’’.. ఇంధన స్వావలంబన వైపు అడుగులు

VSK Telangana    31-Jul-2026
Total Views |
 
sm
 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి ‘‘సముద్ర మంథన్’’ పథకానికి ఆమోద ముద్ర వేయడం.సముద్ర మంథన్ అనేది 84,084 కోట్ల వ్యయంతో రూపొందించారు. దేశంలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తిని వేగవంతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై మన దేశం అత్యధికంగా ఆధారపడుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఏర్పడ్డ ఇబ్బందులు, యుద్ధ వాతావరణం కూడా మనపై తీవ్రంగానే ప్రభావితం చూపిస్తోంది.
 
వీటన్నింటి నేపథ్యంలో ‘‘సముద్ర మంథన్’’ ద్వారా ఇంధన స్వయంసమృద్ధి సాధించుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15 న ఎర్రకోట మీదుగా ఈ పథకాన్ని ప్రకటించారు. దేశ సముద్ర జలాల్లో హైడ్రోకార్బన్ అన్వేషణను మరింత విస్తరించేందుకు ఇదో కీలక అడుగు.
 
ఈ పథకం ద్వారా సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణను మరింత విస్తృతం చేస్తారు. దీంతో ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణ ఈ మొత్తం అంశానికి ఈ పథకం కేంద్ర బిందువు. అలాగే అధిక భూకంప డేటాను కూడా ఇది సేకరిస్తూ, ప్రాసెసింగ్ చేయడం, విశ్లేషించడం ఇందులో భాగమే. అలాగే లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లోని బ్లాకుల్లో కూడా అన్వేషణ డ్రిల్లింగ్ ను ఈ పథకం వేగిరం చేస్తుంది.
 
అలాగే ఇప్పటి వరకూ పెద్దగా అన్వేషించని కొత్త సముద్ర బేసిన్ లలో కూడా శాస్త్రీయ పద్ధతుల్లో డ్రిల్లింగ్ చేయడం, సముద్ర చమురు ఉత్పత్తి కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి అయిన చమురు, గ్యాస్ తీర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయడం ఈ పథకంలో భాగమే. సముద్ర చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తారు.
 
ప్రధాన లక్ష్యాలు
 
భారత సముద్ర జలాల్లో లోతైన ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణ.
దేశీయ చమురు ఉత్పత్తి పెంచడం.
విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం.
భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడం.
దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం.
 
దేశానికి కలిగే ప్రయోజనాలు
 
ఇంధన దిగుమతుల ఖర్చు తగ్గే అవకాశం.
విదేశీ మారకద్రవ్య ఆదా.
ఉపాధి అవకాశాల పెరుగుదల.
"మేక్ ఇన్ ఇండియా" మరియు ఇంధన ఆత్మనిర్భరతకు ఊతం.
దీర్ఘకాలికంగా దేశ ఆర్థికాభివృద్ధికి మద్దతు.