హలాల్, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తీవ్ర శిక్షార్హమైన నేరారోపణలు ఉన్న కేసులను కేవలం పర్సనల్ లా పేరిట ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని కోరడం సమంజసం కాదని జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
హలాల్ పేరుతో ఓ మహిళపై లైంగిక దోపిడీ, సామూహిక అత్యాచారం సంబంధిత ఆరోపణల కేసులో 9 మంది నిందితులపై నమోదైన కేసును కొట్టివేయాలనే పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా.. ఈ ఆరోపణలు సమాజంలోని ఓ వర్గం ఇప్పటికీ రాజ్యాంగం కల్పించిన సమానత్వం, వ్యక్తిగత గౌరవం, గోప్యత వంటి మౌలిక విలువలకు దూరంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని పేర్కొంది.
ఈ వ్యవహారం ముస్లిం వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాలకు సంబంధించినదని.. ఫలితంగా ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని న్యాయస్థానాన్ని కోరారు నిందితులు. అయితే.. ఈ వాదనల్ని ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది. క్రిమినల్ చట్టం అమలులో ఉండగా వ్యక్తిగత చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వలేమని, చట్టంలో ప్రత్యేక మినహాయింపులేమైనా ఉన్నప్పుడే ఇలాంటి వాదనలకు అవకాశముంటుందని స్పష్టం చేసింది. బాలికలపై లైంగిక సంబంధాలకు వ్యక్తిగత చట్టాలను రక్షణగా చూపలేమని, అలాంటి కేసులకు పోక్సో చట్టం వర్తిస్తుందని పేర్కొంది. దీంతోపాటు గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులన్నింటినీ కోర్టు రద్దు చేసింది.