ఆగ్రాలోని తాజ్ మహల్ గతంలో ఓ శివాలయం అని అలహాబాదు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. హరి శంకర్ జైన్‌తో పాటు మరో నలుగురు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం.. వివాదాస్పద ప్రాంగణంలో సర్వే, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ కోసం అడ్వకేట్ కమిషనర్‌ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఆ చారిత్రాక కట్టడం స్థానంలో గతంలో తేజూ మహాలయ్ అనే శివాలయం వుండేదంటూ దాఖలైన పిటిషన్ ఒకటి ఇప్పటికీ కోర్టులో పెండింగ్ లోనే వుంది. ఈ పిటిషన్లకు సమాధానం దాఖలు చేయాలని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్రానికి, ఏఎస్ఐకి ఆదేశాలిచ్చింది.
తేజో మహాలయ వివాదంపై చట్టపరమైన పోరాటం ఈనాటిది కాదు; 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో దీనిపై తొలిసారిగా దావా వేశారు. ఆ తర్వాత కట్టడం తనిఖీ కోసం వేసిన పిటిషన్లను దిగువ కోర్టులతో పాటు, అదనపు జిల్లా జడ్జి కోర్టు కూడా తిరస్కరించాయి. అసలు వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక విచారణ అవసరమా లేదా అన్న కనీస అంశాన్ని పరిశీలించకుండానే కింది కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని పిటిషనర్లు ఆరోపించడంతో, ఇప్పుడు ఈ సుదీర్ఘ వివాదం అలహాబాద్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది.