తమకు అద్భుత శక్తులున్నాయని, గుప్త నిధులను ఈజీగా వెలికితీస్తామంటూ ప్రచారం చేస్తూ, జనాలను మోసం చేస్తున్న మహ్మద్ మునావర్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుడి మల్కాపూర్ కి చెందిన మహ్మద్ మునావర్ వృత్తిరీత్యా కారు మెకానిక్. వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ భారమవుతోందని, గుప్త నిధుల పేరుతో మోసాలు ప్రారంభించాడు. ఇందు కోసం తన స్నేహితులైన సయ్యద్ అలీ, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్ తో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
మునావర్ కి అద్భుతమైన శక్తులున్నాయని, ముఠా సభ్యులు తెగ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఒక్కో పూజకు 7 లక్షల నుంచి 20 లక్షల వరకూ వసూలు చేసేవారు. గత రెండు సంవత్సరాల్లో ఇలా దాదాపు 11 మంది మోసం చేసి, దాదాపు కోటి రూపాయాలను దండుకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రత్యేక బృందాలు దర్యాప్తును ప్రారంభించాయి. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మునావర్ తో పాటు ముఠాను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి కార్లు, ఆటో, బైక్ లు, సెల్ ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలు, బొగ్గు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మోసం ఎలా చేసేవారంటే..
మునావార్ కి ప్రత్యేక శక్తులున్నాయని,దాని ద్వారా భూమిలో వున్న బంగారాన్ని బయటికి తీస్తారని చెప్పేవారు. బాధితుల ఇళ్లకి వెళ్లి, వచ్చి రానీ మంత్రాలు చదివి, అక్కడ గుప్త నిధులు వున్నాయని నమ్మించేవాడు. అక్కడే తవ్వితే బంగారం లభిస్తుందని ఆశ పెట్టేవారు. ఇందుకు 7 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పి, వసూలు చేసేవారు. దాని కోసం ముందే తన వద్ద వున్న బంగారు నాణేలను తవ్విన గుంతలో పడేసేవాడు. పూజ అయ్యాక.. చూడండి.. చూడండి.. బంగారు నాణేలు అని చూపెట్టేవారు.