అసలు ఆరెస్సెస్ అంటే ఏమిటి? ఏం చేస్తుంది?

VSK Telangana    11-Aug-2026
Total Views |
 
RSS
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? ‘‘భవిష్య భారతం - ఆరెస్సెస్ దృష్టికోణం’’ అన్న పేరుతో 2018 సెప్టెంబర్ 17,18,19 తేదీల్లో వ్యాఖ్యాన మాల జరిగింది. ఇందులో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చారు.
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఏమిటి? ఇదొక కార్య ప్రణాళిక (METHODOLOGY). తప్ప ఇంకేమీ కాదు.ఆరెస్సెస్ అనే సంస్థ ఏం చేస్తుంది? అది వ్యక్తి నిర్మాణ కార్యం చేస్తుంది. ఎందుకంటే సమాజపు వ్యవమారంలో అనేక రకాల మార్పులను మనం కోరుకుంటున్నాం. మనకు ఎలాంటి తేడాలు లేని సమాజం కావాలి, సామరస్య పూరిత సమాజం కావాలి, దోపిడీ లేని సమాజం కావాలి. సమాజంలో నుండి స్వార్థ భావనలు తొలిగిపోవాలి. అయితే అలా తొలిగిపోవాలన్నంత మాత్రాన జరిగిపోదు. సమాజపు వ్యవహారం సజీవ ఉదాహరణలు ముందు వుంటేనే మారుతుంది. మనకు ఆదర్శవంతమైన మహా పురుషులకు లోటేమీ లేదు, దేశం కోసం సరస్వాన్ని త్యాగం చేసేవాళ్లు. ఈ భూమిలో అనాది కాలం నుంచి నేటి వరకూ అనేక మంది వున్నారు.
 
అయితే.. మన సాధారణ సమాజపు ప్రవృత్తి ఏమిటి? అది వారి జయంతులు, వర్ధంతులను జరుపుతుంది. వారిని పూజించడమూ చేస్తుంది. కానీ పొరబాటున కూడా వారిలా తయారు కాదు. శివాజీ మహారాజు మళ్లీ పుట్టాలి, కానీ నా ఇంట్లో కాదు, పక్కింట్లో పుట్టాలి అనుకుంటుంది. కొన్నేళ్ళ క్రితం రీడర్స్ డైజెస్ట్ లో ఒక వాక్యం చదివాను. ‘‘THE IDIELS ARE LIKE STARS WHICH WE NEVER REACH (ఆదర్శ వ్యక్తులు నక్షత్రాల్లాంటి వారు, వారిన మనం ఎప్పటికీ చేరుకోలేం). ఆదర్శాలనేవి దూరంగానే వుంటాయి. వాటికి పూజ కూడా జరుగుతుంది. కానీ అనుసరించడం జరగదు. తర్వాత వాక్యమిలా వుంది. ‘‘But we can polt our chart according to them ( అయితే వారి అడుగుజాడల్లో మన జీవిత గమనాన్ని యోజన చేసుకోవచ్చు). అందులో ploting the chart అనే పని మాత్రం జరగదు. ఇది ఎప్పుడు ఎవరి భరోసాతో జరుగుతుంది? మన పక్కనే వున్న వారి వ్యవహార శైలి ప్రభావం మన వ్యవహారం మీద పడుతుంది. దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, సందుల్లో స్వతంత్ర భారతపు ప్రతి పౌరుడు తన నిత్య వ్యవహారంలో ఎలా వుండాలో అలా వుంటూ, ఎలాంటి పరిస్థితులోనైనా తన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా దానిమీద స్థిరంగా నిలబడే, శీలసంపన్నమైన వ్యక్తిగా, సంపూర్ణ సమాజంలో ఆత్మీయ సంబంధం కలిగిన వ్యక్తిగా తయారైనప్పుడు అలాంటి వాతావరణం ద్వారా సమాజపు ఆచరణ (వ్యవహారం శైలి) మారుతుంది.
 
ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మంచి స్వయంసేవకులను తయారు చేయడమే సంఘ యోజన. మంచి స్వయంసేవక్ అంటే విశ్వాస పూరితమైన, విశుద్ధమైన శీలం కలిగినవాడని అర్థం. మొత్తం సమాజాన్ని, దేశాన్ని తనదిగా భావించి అతడు పనిచేస్తాడు. ఎవరి పట్లా భేదభావం లేకుండా, శత్రుత్వ భావనతో చూడకుండా వుండటం వల్ల అతడు సమాజపు స్నేహాన్ని మరియు విశ్వసాన్ని చూరగొంటాడు. ఇలాంటి వ్యవహారం కలిగిన వారి బృందం ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో తయారు కావాలి. ఈ ప్రణాళిక 1925 లో సంఘం రూపంలో ప్రారంభమైంది. సంఘమంటే ఇంతే, ఇంతకు మించి మరేమీ లేదు.
 
మీరేం చేయబోతున్నారని డా.హెడ్గేవార్ ను అడగడం జరిగింది. 1928 లో మొదటిసారిగా నాగపూర్ లో సంఘ పథ సంచలనం జరిగినప్పుడు అందులో చాలా ఎక్కువ మందేమీ లేరు. 21-22 మంది మాత్రమే వున్నారు. అయితే ఆనాటి మన సమాజంలో 21-22 మంది కూడా ఒక దిశలో కాళ్లు కలిపి నడవటమనేది చాలా అరుదైన విషయం. కాబట్టి ప్రజలు ప్రభావితులయ్యారు. హెడ్గేవార్ వద్దకు వెళ్లారు. ఆయన విప్లవ మనస్తత్వం కలిగినవారని, ఆయన తన జీవితాన్ని దేశం కోసం సమర్పించుకున్నారని వాళ్లకు తెలుసు. ఆయనకు చాలా దూరదృష్టితో కూడిన ప్రణాళిక ఏదో వుంది అని వారికి అనిపించింది. అందువల్ల చాలా విశ్వాసంతో డాక్టర్ గారూ, నేడు 50 మంది అయ్యారు, మరి భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? అని అడిగారు. అప్పుడు డాక్టర్జీ యాబై తర్వాత 500 చేస్తాను అన్నారు. అయిదు వందల తర్వాత మళ్లీ 5 వేలు చేస్తాను. అయిదు వేల తర్వాత? ఆ తర్వాత? మీరనుకున్నట్లే అయిదే అనుకోండి; అప్పుడేం చేస్తారు? యాబై వేలు చేస్తాను. అలా పెరుగుతూ పెరుగుతూ ఆ సంఖ్య అయిదు కోట్లు చేరుకుంటుంది.
 
ఆ తర్వాత మళ్లీ ఏం చేస్తారు? అని అడిగారు. అందుకు డాక్టర్జీ మొత్తం హిందూ సమాజాన్ని మనం సంఘటితం చేయాల్సి వుంది. హిందూ సమాజంలో ఒక ప్రత్యేక సంస్థను తయారు చేయాలనుకోవడం లేదు. అందరినీ సంఘటితం చేయాలి. దీన్ని వదిలిపెట్టి, చేయాల్సిన మరో పనేమీ మనకు లేదు. ఎందుకంటే ఇలాంటి సమాజాన్ని తయారు చేసిన తర్వాత జరగవలసింది దానంతట అదే జరుగుతుంది. దాని కొరకు ‘‘మరికేమీ’’ చేయాల్సిన అవసరం వుండదు అన్నారు.