యుగయుగాల రామకథను అమృతంగా మార్చిన అమరకవి తులసీదాస్

VSK Telangana    12-Aug-2026
Total Views |


tulasi das 

భారతీయ ఆధ్యాత్మిక, సాహిత్య గగనంలో నిరంతరం ప్రకాశించే భాస్కరుడు గోస్వామి తులసీదాస్. పండితుల శ్లోకాలకు మాత్రమే పరిమితమైన రామకథను సామాన్య ప్రజల అనునిత్య సంభాషణలోకి తెచ్చి, ప్రతీ ఇంటా భక్తి రసాన్ని కురిపించిన ఆధ్యాత్మిక సాహిత్య శిఖరం ఆయన.

జననం…బాల్యం

16వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్ రాజ్‌పూర్ గ్రామంలో తులసీదాస్ జన్మించారు. జన్మించిన వెంటనే ఏడవకుండా "రామ" అని ఉచ్చరించడం వల్ల ఆయనకు రాంబోలా అనే నేత్రపర్వమైన నామం లభించింది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నీడను కోల్పోయి అనాథగా మారిన రాంబోలాను నరహరిదాస్ అనే ఆధ్యాత్మిక గురువు చేరదీశారు. విద్యాబుద్ధులతో పాటు రామ భక్తి రసాన్ని నూరిపోసి, ఆయనను తులసీదాస్‌గా తీర్చిదిద్దారు.

సంసార బంధం నుండి నిశ్చల భక్తి వైపు మలుపు

తులసీదాస్ యుక్త వయసులో రత్నావళి అనే గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకున్నారు. భార్యపై అమితమైన అనురాగంతో ఉన్న తులసీదాస్‌కు ఆమె చెప్పిన ఒక హితోక్తి జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది:

"అస్థి చర్మ మయ దేహ ఇది, తామే జైసీ ప్రీతి।

తైసీ జో శ్రీరామ మహు, హోత న తౌ భవభీతి॥"

(తాత్పర్యం: ఎముకలు, మాంసంతో నిర్మితమైన ఈ శరీరంపై నీకున్న ప్రేమలో సగం ఆ శ్రీరాముడిపై ఉంటే భవబంధాల నుండి ముక్తి లభించేది.)

ఈ సూటి మాటలు తులసీదాస్ హృదయాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఆ క్షణమే ఐహిక బంధాలను వీడి, కాశీ-చిత్రకూటాల వైపు పరిపూర్ణ రామ భక్తి మార్గంలో అడుగులు వేశారు.

తులసీదాస్ రచనా వైభవ విశ్వరూపం

తులసీదాస్ సాహిత్యం కేవలం భక్తి మార్గానికే పరిమితం కాలేదు; అది రస భావ అలంకార శోభితమైన మహా కావ్యామృతం. ప్రజా భాషలైన అవధి, వ్రజ్ భాషల్లో ఆయన సృష్టించిన కావ్యాలు భారతీయ సాహిత్య రంగానికి అత్యున్నత రత్నాలు.

శ్రీరామచరితమానస్ – జన హృదయ మహాకావ్యం

వాల్మీకి మహర్షి సంస్కృతంలో రాసిన రామాయణాన్ని సామాన్యుడి హృదయానికి హత్తుకునేలా అవధి భాషలో రచించారు. ఏడు కాండలుగా రూపుదిద్దుకున్న ఈ గ్రంథం మానవ ధర్మం, పితృవాక్య పరిపాలన, సోదరప్రేమ, ఉత్తమ రాజనీతికి అద్దం పడుతుంది.

"మంగళ భవన అమంగళ హారీ।

ద్రవహు సుదశరథ అజిర బిహారీ॥"

శ్రీరాముడి దివ్య గుణాలను కీర్తించే ఈ చరణం నేటికీ ప్రతీ భారతీయ గృహంలో మంగళ ప్రదమైన ప్రార్థనగా మ్రోగుతోంది. సంస్కృత పండితుల వ్యతిరేకతను దాటుకుని సామాన్య ప్రజల నాలికలపై రామనామాన్ని నిలిపిన ఘనత ఈ కావ్యానికే దక్కుతుంది.

నలభై చౌపాయిల్లో హనుమంతుడి అమోఘమైన శౌర్యం, భక్తి, వినయాలను అత్యంత సుందరంగా వర్ణించారు.నలభై దోహాలతో రాసిన ఈ హనుమాన్ చాలీసా మనలోని భయాందోళనలు తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని నింపే దివ్య మంత్రంగా ఇది విరాజిల్లుతోంది.

"సంకట హరై మిటై సబ పీరా।

జో సుమిరై హనుమత బలబీరా॥"


భక్తుడికి, భగవంతుడికి మధ్య నడిచే ఆధ్యాత్మిక లేఖల రూపంలో వ్రజ్ భాషలో రాసిన వినయ పత్రికలో శరణాగతి భావాలు పరాకాష్ఠకు చేరాయి. అలాగే కవితా శిల్ప ప్రావీణ్యం కనిపిచే కవితావళి, మరియు రెండు లైన్ల ద్వారా మానవ జీవితానికి అవసరమైన అత్యున్నత నీతి సూత్రాలను, ఆధ్యాత్మిక సత్యాలను బోధించే దోహావళి వంటి గ్రంథాలు ఆయన అనన్యమైన కవితా వైభవానికి, లోతైన జ్ఞానానికి నిదర్శనాలు.

1623 లో కాశీలోని అసి ఘాట్ వద్ద తులసీదాస్ పరమపదించారు. భౌతికంగా నిష్క్రమించినా, ఆయన అందించిన అమర సాహిత్యం తరతరాలకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచింది. పండితుల నుండి పామరుల వరకు అందరినీ రామనామ అమృతంలో ఓలలాడించిన గోస్వామి తులసీదాస్ జీవితం, ఆయన రచనా వైభవం చిరస్మరణీయం.