ఎర్రకోట పేలుళ్ల వెనుక అల్‌ఖైదా హస్తం.. UNSC నివేదిక

VSK Telangana    13-Aug-2026
Total Views |

delhi 
 
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన పేలుడులో 'అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' హస్తం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) తన నివేదికలో పేర్కొంది. 'ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' ఒక విచ్ఛిన్నమైన సంస్థ నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా పరిణామం చెందిందని వివరించింది. వికేంద్రీకృత, చిన్న సెల్స్ ద్వారా పనిచేస్తూ లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకుందని తెలిపింది. బంగ్లాదేశ్‌లో తమ సెల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఆల్‌ఖైదా గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలపై యూఎన్ఎస్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది.
 
ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' ఒక విచ్ఛిన్నమైన సమూహం నుంచి ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా పరిణామం చెందుతూనే ఉంది. ఇది పెద్ద పెద్ద యూనిట్లకు బదులుగా వికేంద్రీకరణ అన్న వ్యూహాన్ని అనుసరిస్తూ, చిన్నగా ఉన్న సెల్స్ రూపంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో లాజిస్టిక్స్, ఆర్థిక నెట్‌వర్క్‌లను స్థాపించింది. దిల్లీలోని ఎర్రకోట వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన దాడికి అధికారికంగా 'ఆల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్' కారణమని నిర్ధారణ అయ్యింది" అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన నివేదికలో పొందుపరిచింది.
 
కెమికల్స్, జీవ కారకాలను అభివృద్ధి చేయడంలో ఆల్‌ఖైదా, ఐఎస్ఐఎల్ చాలా ఏళ్లుగా ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది. అయితే ఈ రెండు ఉగ్రసంస్థలు ఆయుధాల తయారీకి సంబంధించిన సాంకేతిక సవాళ్లను ఇప్పటివరకు అధిగమించలేకపోయాయని వెల్లడించింది. రసాయనాలు, జీవ కారకాలను అభివృద్ధి చేయడానికి సంబంధించిన సూచనలు ఆన్‌లైన్‌లో ఉగ్రవాద వర్గాలకు విస్తృతంగా ప్రచారం అయ్యాయని స్పష్టం చేసింది.
 
ఎన్ఐఏ రిపోర్టులనూ కీలక విషయాలు..
 
గతేడాది నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో దాదాపు 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాద కుట్రలో భాగమని కేంద్ర సంస్థలు తేల్చాయి.
 
ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ ఫరీదాబాద్‌లోని తన ఫ్లాట్‌ను బాంబు తయారీ కేంద్రంగా మార్చాడు. బాంబు తయారీ కోసం 'రాహుల్ భట్' అనే నకిలీ ఐడీతో ఆన్‌లైన్‌లో రసాయనాలు, ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేశాడు. ఇండియామార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు సృష్టించి పేలుడు పదార్థాలకు ఉపయోగించే వస్తువులను ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రోలిసిస్ విధానాన్ని ఉపయోగించి అతడు బాంబును తయారు చేశాడని ఎన్ఐఏ పేర్కొంది.
 
సాధారణ ఉప్పు ద్రావణం నుంచి క్లోరేట్లు, పెర్కోరేట్లను తయారు చేసేందుకు నిందితుడు ఎలక్ట్రోలిసిస్‌ విధానాన్ని ఉపయోగించాడు. క్లోరేట్లు, పెర్కోరేట్లు పేలుడు పదార్థాల్లో ఉపయోగించే కీలక రసాయనాలు. తన ఫ్లాట్‌లోనే ఉమర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించాడని ఎన్ఐఏ తన రిపోర్టులో పొందుపరిచింది.