నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన సీనియర్ అండర్‌గ్రౌండ్ నాయకురాలు కాకరాల సమత పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ నెల 11 న తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో ములుగులో ఆయుధాలు వదిలి లొంగిపోయింది. నక్సల్ ఉద్యమంలో పనిచేసిన సమత.. మాధవి, దుర్గ, షకీలా, మాసే వంటి మారు పేర్లతో ఉద్యమంలో పనిచేసింది.అలాగే నక్సల్ ఉద్యమంలో ఇంటెలిజెన్స్ ప్రచార బాధ్యతలను నిర్వహించే రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కూడా పనిచేసింది. మావోయిస్టు పార్టీకి మిగిలిపోయిన ఏకైక సీనియర్ సిద్ధాంతకర్త సమత అని, ఆమె లొంగిపోయారని పోలీసులు ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వ సరణ్డర్, రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం ఆమెకు అర్హత కలిగిన మొత్తం రివార్డు కింద రూ.20 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు.
40 ఏళ్ల అజ్ఞాత జీవితం...
కాకరాల సమత స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ నటుడు. ఆయన 1960లోనే రాజమహేంద్రవరం నుంచి చెన్నైకి వలస వెళ్లారు. సమత చెన్నైలోనే తన విద్యార్హతను కొనసాగించారు. 1985లో చెన్నైలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితురాలై చదువును మధ్యలోనే ఆపేసి సీపీఐ (ఎమ్ఎల్) పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.
ఆమె ఇంట్లో నిరంతరం సాగే చర్చలు, విప్లవ రచయితలు, నాయకుల రాకపోకలు సాగుతుండేవి. ఈ పరిణామాలు ఆమెను ఉద్యమం వైపు తీసుకెళ్లాయి. 1984 లో ఇంటర్ చదువుతున్న సమయంలో ‘‘తమిళనాడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా ఉద్యమాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ వైపు ఆకర్షితురాలై, యూజీలోకి వెళ్లిపోయింది.
పార్టీలో చురుగ్గా పనిచేసిన సమత 1991 నాటికి ఏరియా కమిటీ మెంబర్ (ACM) స్థాయికి ఎదిగారు.1994 లో డివిజనల్ కమిటీ మెంబర్ గా, 2003 నాటికి స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగింది. నల్లమల్ల, మహబూబ్ నగర్, అచ్చంపేట దళాల్లో పనిచేసింది. ఆ తర్వాత యూపీ, ఉత్తరాఖండ్, బిహార్ ప్రాంతాల్లో కూడా పని చేసింది. అలాగే మావోయిస్టు అగ్రనేత గణపతి వద్ద కూడా పనిచేసింది. ఆ తర్వాత ఆమెను 'సెంట్రల్ ఆర్గనైజర్' బాధ్యతలతో హైదరాబాద్‌కు బదిలీ చేశారు.
అర్బన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2015లో ఆమెను సౌత్ రీజినల్ బ్యూరో అర్బన్ ఏరియాకు బదిలీ చేసిన పార్టీ నాయకత్వం, పట్టణ ప్రాంతాల్లో మహిళల సమస్యలు, ఇంటెలిజెన్స్ సేకరణ, ప్రచార విభాగాన్ని పర్యవేక్షించే పూర్తి బాధ్యతలను అప్పగించింది. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీలో పని చేసిన సమత… ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.