రైతుల ఆర్థిక అభివృద్దిలో ఎథనాల్ ఒక కీలకమైన మలుపు: బికెఎస్

VSK Telangana    02-Aug-2026
Total Views |
e20
 
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీని వల్ల వాహనాలు చెడిపోతాయని, రైతులకు కూడా ఉపయోగం వుండదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ సంఘ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రైతు సమావేశాలు నిర్వహించింది. ఇందులో బీకేఎస్ జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డి రైతులకు ఇథనాల్ పై అవగాహన కల్పించారు. దేశ ప్రగతికి, రైతుల ఆర్థిక అభివృద్దికి ఎథనాల్ విధానం ఒక కీలకమైన మలుపు అని ఆయన పేర్కొన్నారు.
 
ఎథనాల్ తయారీ - రైతులకు ప్రయోజనాలు:
 
'పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్' కలిపే కేంద్ర ప్రభుత్వ విధానం రైతుల ఆదాయాన్ని పెంచడంలో విశేషంగా తోడ్పడుతుంది. ఎథనాల్‌ను కేవలం చెరకు నుండే కాకుండా మొక్కజొన్న, వరి వంటి ఇతర వ్యవసాయ పంటల నుంచి కూడా తయారు చేస్తారు.
 
ఆదాయ వృద్ధి: పంటల నుండి ఎథనాల్ ఉత్పత్తి పెరిగే కొద్దీ, మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి రైతులకు మంచి ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.
 
అంతర్జాతీయ ఆమోదం: అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఎథనాల్ ఆధారిత ఇంధనాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. ఇది వాహన ఇంజిన్‌లపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదని స్పష్టమవుతోంది.
 
పర్యావరణం & విదేశీ మారకద్రవ్యం: ఎథనాల్ వాడకం వల్ల విదేశీ చమురు దిగుమతులపై భారతదేశ ఆధారపడటం తగ్గుతుంది, తద్వారా పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.
 
ఎథనాల్‌పై అపోహల ఖండన:
 
ఎథనాల్ ఉత్పత్తికి వ్యతిరేకంగా ప్రచారమవుతున్న వార్తలను సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎథనాల్ తయారీలో వేలాది లీటర్ల నీరు వృధా అవుతుందనే ప్రతిపాదనలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన తెలిపారు. పరిశ్రమలలో చెరకు రసం తీసేందుకు అత్యల్ప పరిమాణంలో నీరు అవసరమవుతుందని, ఆ నీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ పునర్వినియోగం (Recycling) చేస్తారని సాంకేతిక వివరణ ఇచ్చారు. ఎథనాల్‌ను వ్యతిరేకించేవారు రైతుల శ్రేయోభిలాషులు కాజాలరని సాయిరెడ్డి పేర్కొన్నారు.