బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య

VSK Telangana    23-Aug-2026
Total Views |
 
bangla
 
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఓ హిందు కుటుంబం దారుణ హత్యకు గురైంది. రంగపూర్ నగరంలో ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తెతో పాటు 12 ఏళ్ల బాలుడి మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. వీరందర్నీ గొంతు నులిమి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్ ముఠా ఈ ఘాతుకానికి పాల్పడింది. 
 
ఈ ఘటనపై పోలీసులు, సీఐడీ, డిటెక్టివ్ బ్రాంచ్ కలిపి సంయుక్తంగా దర్యాప్తు చేస్తుండటం విశేషం.స్థానిక పత్రిక కథనం ప్రకారం శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రంగపూర్ నగరంలోని దాస్ పరా ప్రాంతం నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), వారి కుమార్తె ఆగమి చక్రవర్తి, ఆమె కుమారుడు ప్రియం చక్రవర్తిగా గుర్తించారు.
 
తల్లి మరియు కుమార్తె మృతదేహాలు మెట్ల వద్ద లభించగా, గణపతి చక్రవర్తి మృతదేహం ఇంటి పైకప్పుపై లభించిందని పోలీసులు ప్రకటించారు. అలాగే 12 ఏళ్ల బాలుడి మృతదేహం మంచం కింద లభ్యమైంది. CID అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాధితులందరిని గొంతు నులిమి చంపినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి మరియు శుక్రవారం తెల్లవారుజాము మధ్య ఎప్పుడో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు; గురువారం రాత్రి నుండే ఆ కుటుంబానికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
ప్రీతిలత సోదరి పూజా చక్రవర్తి మాట్లాడుతూ, తాను చివరిసారిగా గురువారం మధ్యాహ్నం తన సోదరితో మాట్లాడానని పేర్కొన్నారు. ఫోన్లు నిరంతరం స్విచ్ ఆఫ్ అయి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, శనివారం రాత్రి దాస్‌పారాలోని ఆ ఇంటికి చేరుకున్నారు.అప్పుడే అసలు విషయం బయటపడింది. ఇంటి ప్రధాన ద్వారం తాళం వేసి ఉండటం, లోపల లైట్లన్నీ ఆపివేసి ఉండటాన్ని వారు గమనించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా, అక్కడ నలుగురి మృతదేహాలు వేర్వేరు ప్రదేశాలలో కనిపించాయి.