అనధికారకంగా వుంటున్న 111 మంది నిరాశ్రయులైన పిల్లలు.. కేంద్రం జోక్యాన్ని కోరిన LRPF

VSK Telangana    05-Aug-2026
Total Views |

lprf 
 
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LPRF) కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ)చట్టం, 2015 కింద విధిగా ఉండాల్సిన నమోదు (రిజిస్ట్రేషన్) లేకుండా నడుస్తున్న లేదా ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు అనర్హమైనవిగా ప్రకటించిన చైల్డ్ కేర్ హోమ్‌లలో కనీసం 111 మంది నిరాశ్రయులైన పిల్లలు నివసిస్తున్నారని LPRF ఆరోపించింది.
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని బాలల సంక్షేమ అధికారులు తీవ్రమైన బాలల హక్కుల ఉల్లంఘనలకు, పరిపాలనా నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఈ సంస్థ కోరింది.
 
చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ లేకుండా లేదా చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించకుండా నడుస్తున్నట్లు అధికారిక తనిఖీ నివేదికలు ధృవీకరించినప్పటికీ, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పిల్లలను రక్షించడంలో, ఆ సంస్థలను మూసివేయడంలో, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో లేదా బాధ్యులైన అధికారులను జవాబుదారీ చేయడంలో విఫలమయ్యారని LRPF పేర్కొంది.
 
గుడ్ సమరిటన్ చిల్డ్రన్స్ హోమ్, తణుకు (26 మంది పిల్లలు) మరియు గుడ్ సమరిటన్ చిల్డ్రన్స్ హోమ్, పాలకొల్లు (16 మంది పిల్లలు) రిజిస్ట్రేషన్ లేదా పునరుద్ధరణకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు మరియు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించలేదని జిల్లా స్థాయి తనిఖీ కమిటీ (DLIC) గుర్తించింది.
 
పాలకొల్లులోని హోమ్‌లో సీసీటీవీ నిఘా, అగ్నిమాపక పరికరాలు మరియు విధిగా నిర్వహించాల్సిన రిజిస్టర్లు లేవని, పైగా ఇది అద్దె ప్రాంగణంలో నడుస్తోందని తనిఖీ నివేదికలో పేర్కొన్నారు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, అధికారుల నుండి ఎలాంటి తక్షణ రక్షణ చర్యలు లేకుండా పిల్లలు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు.
 
క్యాథలీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ (60 మంది పిల్లలు) మరియు ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్ (9 మంది పిల్లలు) ఎటువంటి విధిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 42 కింద చట్టపరమైన చర్యలు ప్రారంభించడానికి బదులుగా, రిజిస్ట్రేషన్ "ప్రక్రియలో ఉంది" అని వారు చెప్పిన సమాధానాన్ని అధికారులు అంగీకరించారు.
 
గ్రేస్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ విషయానికొస్తే, ఈ సంస్థ 2021లోనే మూతపడిందని తనిఖీ నివేదిక పేర్కొంది కానీ, అంతకుముందు అక్కడ ఉన్న పిల్లల పునరావాసం లేదా వారి చిరునామా గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
 
అలాగే, నిరీక్షణ ఆర్ఫనేజ్ మరియు బ్లెస్సింగ్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ డిసేబుల్డ్ సంస్థలు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవని అధికారులు కేవలం నమోదు చేసి వదిలేశారు తప్ప, తదుపరి చర్యల కోసం అక్కడి సంబంధిత అధికారులకు విషయాన్ని బదిలీ చేశారో లేదో పేర్కొనలేదు.
 
FCRA నిబంధనల ఉల్లంఘన:
 
విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (FCRA) నిబంధనల ఉల్లంఘనలపై కూడా విచారణ జరిపించాలని LRPF కోరింది.
 
'క్యాథలీన్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ విడోస్' మరియు 'ఫెయిత్ విజన్ చిల్డ్రన్స్ హోమ్' FCRA కింద నమోదు చేసుకుని, అనాథల సంరక్షణ, బాలల సంక్షేమ కార్యక్రమాల పేరుతో విదేశీ విరాళాలను పొందుతున్నాయని, అయితే జువైనల్ జస్టిస్ చట్టం కింద నమోదు లేకుండానే ఈ హోమ్‌లను నడుపుతున్నారని ఫిర్యాదులో తెలిపింది. ఈ అంశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపాలని విజ్ఞప్తి చేసింది.
 
LRPF డిమాండ్లు:
 
కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకుని తనిఖీ నివేదికలు మరియు తీసుకున్న చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలి.
 
సంబంధిత అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలి.
 
ఈ హోమ్‌లలోని ప్రతి బిడ్డ పరిస్థితిని సమీక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు ప్రవేశపెట్టి, చట్టప్రకారం తగిన సంరక్షణ, పునరావాసం కల్పించాలి.
 
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సంస్థలపై సెక్షన్ 42 కింద చర్యలు ప్రారంభించాలి.
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చైల్డ్ కేర్ హోమ్‌లపై సమగ్ర సమీక్ష నిర్వహించాలి.