
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక తీవ్రమైన డిజిటల్ కుట్ర దాగి ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శనను ఉద్దేశపూర్వకంగానే హింస వైపు మళ్లించేందుకు సోషల్ మీడియా వేదికగా పక్కా ప్రణాళికతో కృత్రిమ ప్రచారం సాగించినట్లు సైబర్ సెల్, ఫోరెన్సిక్ బృందాల దర్యాప్తులో తేలింది. ఈ నెట్‌వర్క్ మూలాలను ఉపసంహరించేందుకు గాను సోషల్ మీడియా దిగ్గజాలైన మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ విభాగం నోటీసులు పంపింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం.. జూలై 20 నుంచి జూలై 23 మధ్య కాలంలో వేల సంఖ్యలో నకిలీ ఖాతాలు, విదేశీ బాట్ (Bot) నెట్‌వర్క్‌లను ఉపయోగించి తీవ్రమైన రెచ్చగొట్టే రీల్స్, వివాదాస్పద వీడియోలు, అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్లాట్‌ఫారమ్‌ల అల్గారిథమ్‌లను మేనేజ్ చేస్తూ, ఈ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేయడం వల్లే నిరసనకారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని అధికారులు తెలిపారు.
ఈ రెచ్చగొట్టే ప్రచారం వల్లే జంతర్ మంతర్, జన్ పథ్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు తీవ్ర హింస చెలరేగింది. ఆందోళనకారులు పోలీసులు మరియు మీడియా ప్రతినిధులపైకి రాళ్లు రువ్వి విద్వేషం వెళ్లగక్కారు.
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు, నోటీసులు అందుకున్న దిగ్గజ సంస్థల నుంచి నకిలీ ఖాతాల ఐపీ (IP) అడ్రస్‌లు, సర్వర్ లాగ్స్, లాగిన్ హిస్టరీతో పాటు వాటి లొకేషన్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మరోవైపు, గతంలో 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పని చేసిన దాదాపు 480 పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలు ఈ జంతర్ మంతర్ ప్రచారంలో కూడా చురుగ్గా వ్యవహరించినట్లు సైబర్ సెల్ గుర్తించింది. దీంతో ఈ ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను నడిపించడానికి భారీగా నిధులు సమకూరినట్లు అనుమానిస్తున్న పోలీసులు, బ్యాంక్ లావాదేవీల ఆధారాలను ఫోరెన్సిక్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే, ప్రతినిధి సౌరవ్ దాస్‌తో పాటు పార్టీలోని ఇతర కీలక నేతలను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.