కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ విషయంలో మరో కీలక సమాచారం బయటికి వచ్చింది. తాను రైఫిల్ షూటర్ ని అత్తరు వ్యాపారులకు చెప్పుకొని, విషపూరితమైన లిక్విడ్ ను వారి దగ్గరి నుంచి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అత్తరు వ్యాపారుల కూడా ధ్రువీకరించారు. సాదిక్ తమ దగ్గరికి వచ్చాడని, విషపూరిత లిక్విడ్ కావాలని అడిగాడని చెప్పుకొచ్చారు. మొదట తాము థాయ్ పొటాషియం ఇచ్చామని, ఆ సమయంలో ఎందుకు అని అడిగామని, తాను షూటర్ నని చెప్పుకొని తీసుకెళ్లాడని చెప్పారు.
అయితే. థాయ్ పొటాషియం ఆహార రూపంలో ఎవరికైనా ఇస్తే, అది ఆ మనిషి శరీర అవయవాల్లోకి నెమ్మదిగా చేరి, వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. పొటాషియం సైనైడ్ మిక్సింగ్ లిక్విడ్ కూడా ప్రమాదకరమే. ఇది మనిషి ప్రాణాలను వెంటనే హరిస్తుందని కూడా అత్తరు వ్యాపారులు పేర్కొంటున్నారు.
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కాకినాడ పోలీసులు మరోమారు సాదిక్ ను విచారించారు. అలాగే సమాంతరంగా అత్తరు వ్యాపారులను కూడా విచారించారు. తొలిరోజు మంగళవారం సర్పవరం స్టేషన్‌లో ఉంచి విచారించిన పోలీసులకు సాదిక్ ఖాన్ సహకరించలేదు. నేరాన్ని పూర్తిగా నూకరాజు కుమార్తె సౌజన్యపైకి నెట్టే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇక రెండోరోజు బుధవారం అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్, సీఐ ప్రకాశ్ మరో ఇద్దరు ఎస్‌ఐలు సాదిక్‌ను ప్రశ్నించారు.
‘‘జగదీశ్వరరెడ్డి మరణం వెనుక నీ హస్తం ఉందని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు? అతడికి సైనైడ్ వంటి విషపూరితమైన లిక్విడ్ కలిపిన ప్రొటీన్ డ్రింక్ ఇచ్చి చంపినట్టుగా ఫిర్యాదు చేశారు. దీనిపై నీ సమాధానం ఏంటి?, నువ్వు ఏం చదివావు? ఎక్కడ చదివావు?’ ఇలా సుమారు చాలా ప్రశ్నలే వేసినట్లు సమాచారం. కాగా, సాదిక్ ఖాన్ విద్యార్హత, అలాగే రైఫిల్ షూటింగ్‌లో అతడు సాధించిన సర్టిఫికెట్లు అంతా ఫేక్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడి విద్యాభ్యాసమే సరిగా సాగలేదని, రైఫిల్ షూటింగ్‌కు సరైన ధ్రువీకరణ కూడా లేదని తెలిసింది.