మాతృభూమి అంటే కేవలం మట్టి, రాళ్లు, రప్పలు మాత్రమే అని కొందరు మేధావులు, ప్రముఖులు తప్పుడు ఆలోచనలతో పేర్కొంటూ వుంటారు. అలాంటి వారు మేధస్సు.,. మాత్రమే గొప్పది అంటూ వాదిస్తారు. వారికి మాతృభూమి అంటే కొంత భూభాగం మాత్రమే. అయితే మేధోపరమైన వాదనకు కూడా కొన్ని పరిమితులు వున్నాయి. ఉదాహరణకు మానవ శరీరం ఒక భౌతిక రూపం. మన తల్లి శరీరం కూడా ఇతర మహిళల మాదిరిగానే భౌతిక రూపమే. అలాంటప్పుడు తల్లిని ఇతర మహిళల కన్నా ఎందుకు భిన్నంగా చూడాలి? తల్లి పట్ల ఎందుకు భక్తి భావన కలిగి వుండాలి? మేధస్సు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పదు.
మరో ఉదాహరణ చూద్దాం. మానవ శరీరం ఎదుగుదలకు పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, నీరు అవసరం. ఈ పదార్థాలు మానవ కండరాలలో అవసరమైన మేరకు లభిస్తాయి. అయితే జంతు శాస్త్రం ప్రకారం మానవుడు అంటే కండరాలు, రక్తం, ఎముకలతో నిర్మితమైంది మాత్రమే. అందువల్ల మనం పొరుగునే వున్న వానిని ఎందుకు తినకూడదు? ఈ విధంగా ఎవరైనా అంటే ఆయన మేధావి, మంచి మాటకారి కావొచ్చు కానీ నాగరికమైన వ్యక్తిగా పరిగణించలేం. అటువంటి మేధస్సు సాటి మానవులనే పీక్కొని తినివేసే పరిస్థితులకు దారి తీస్తుంది. అందువల్ల మేధస్సు మాత్రమే వుంటే సరిపోదు. మానవుడు హృదయ స్పందనలను అనుభవించే మేధావి అయి వుండాలి.
మాతృభూమి భావన - వికాసం
ఈ భూమిపై వున్న మట్టి, రాళ్లు, రప్పల పట్ల మనకు మాతృభూమి భావన ఎలా కలిగింది. పరిణామ క్రమంలో జీవులు అభివృద్ధి చెందుతూ మన పోషణకు అవసరమైన అన్నింటికి మాతృభావనను ఆపాదించడం మనకు తెలుసు. ఈ భావన ప్రాణులకు, ప్రాణం లేని వాటికి కూడా వర్తిస్తుంది. మీరు ఒక పాము లేదా కప్పను ఉదాహరణగా తీసుకోవచ్చు. వాటికి ‘‘తల్లి’’ అనే భావన తెలియదు. తమ సంతానానికి ఏమి జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి వాటికి లేదు. ఈ జాతులు తమను తల్లి పిల్లగా పరిగణించవు. నెమ్మది నెమ్మదిగా పాలిచ్చే జంతువులలో తల్లి అనే భావన పెరిగింది. ఈ జంతువులు పిల్లలకు పాలిచ్చి పెంచడం ప్రారంభమైంది. పక్షులు కూడా తమ గుడ్లను పొదిగి, పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరే వరకూ కాపాడతాయి. ఈ పిల్లలు తమ తల్లిని మరిచిపోతే అవి తమ తల్లిని మరిచిపోయి, తెలియని వారిగా మిగిలిపోతాయి. పరిణామ క్రమంలో ఉన్నతులైన జీవులుగా మానవులు ఎదిగారు. మానవుడు నాగరికుడు. తనకు ఉపయోగపడినా, పడకపోయినా తల్లిని గౌరవిస్తాడు. వాస్తవానికి తల్లి వృద్ధురాలు, అంధురాలు అయితే ఆమెను మరింత ప్రేమతో ఆదరిస్తాడు, ఆరాధిస్తాడు కూడా.
మానవునికి తల్లి పట్ల వున్న భక్తి, ప్రేమను ఉన్నతంగా భావిస్తాడు. మానవుడు తన పరిసరాలను మరింత శ్రద్ధతో గమనించినప్పుడు తాను రుణపడిన అనేక వస్తువులను గుర్తిస్తాడు. వాటిని తన తల్లికి ప్రతిరూపాలుగా గుర్తిస్తాడు. నదులను తనకు నీరు, ఆహారం అందించేవాటిగా చూస్తాడు. నదులను ‘‘మాత’’ గా సంబోధిస్తాడు. తన తల్లి పాలపై ఆధారపడటం తగ్గిన తర్వాత జీవితాంతం తమకు పాలను అందించే ఆవులను గోమాతగా గౌరవిస్తాడు. నెమ్మది నెమ్మదిగా తన జీవనానికి అవసరమైన అన్నింటినీ అందించే ఈ నేలను ‘‘భూమాత’’గా మాతృభూమిగా తన జీవితాంతం గౌరవిస్తాడు. తల్లులందరి కన్నా మాతృభూమే గొప్పదని గుర్తిస్తాడు. ఆ విధంగా మాతృభూమిని తల్లిగా భావించడం మేధోవికాసానికి నిదర్శనం. వేదాల్లో కూడా.. ‘‘మాతా భూమి: పుత్రోహం పృథివ్యా:’’ (అధర్వణ వేదం 12-1-12).. ’’ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను’’ .
మాతృభూమి పట్ల అత్యంత గౌరవం, శ్రద్ధ వుండే విధంగా చూడటం మన కర్తవ్యం. మాతృభూమి పట్ల మన భక్తిని ఏ విధంగా ప్రకటించాలో ఆలోచించాలి. దీనికి రెండు విధానాలున్నాయి. ఒకటి ఏమంటే పుష్పాలు, హారతి తదితర మార్గాల ద్వారా పూజించడం, పవిత్ర నదులలో స్నానం చేయడం. ఈ విధంగా ఔపచారికమైన సాధన చేస్తూ భక్తిని ప్రదర్శించడం.
ఈ భక్తికి మరో మార్గం జాతి జీవనంలో నిమగ్నమవుతూ దేశ స్వాతంత్రం కోసం , మాతృభూమిలోని ప్రతి అణువు కోసం, ఆత్మ గౌరవం కోసం మనలను అర్పించుకోవడం.నిజానికి ఈ ప్రపంచంలో ఈ భావన అత్యవసరం. హృదయం అంతా మాతృభూమి పట్ల భక్తి భావనతో నిండిపోతే ఏ చిన్న అగౌరవం జరిగినా అతను సహించడు. మహా భారతంలోని భీమసేనునిగా మారి, తన మాతృభూమిని అవమానించిన వారిని, దాడి చేసిన వారిని చీల్చి చెండాడుతాడు. గతంలో మాతృభూమికి జరిగిన అవమానం అతని హృదయాన్ని కలచివేస్తూ వుంటుంది.
విజయం పట్ల ఆత్మ విశ్వాసం లేకపోతే మన మాతృభూమి పట్ల ఎంత భక్తి వున్నా ప్రయోజనం లేదు. ఈ యుద్ధ భూమిలో అడుగడుగునా అసుర శక్తులను ఎదిరించాలి. కేవలం పవిత్రమైన నడవడిక సరిపోదు. మెత్తగా వ్యవహరిస్తే ఒక క్షణం కూడా మనుగుడ సాగించలేం. ఏమైనా.. ఈ పద్ధతి విజయవంతం కావాలంటే, ముందుగా మనిషి స్వభావాన్ని సరిదిద్దాలి. జీవనతత్వాన్ని గురించిన సరైన అవగాహన వారిలో కలిగించాలి. వారు స్వార్థమే పరమార్థంగా గల తమ వేడుకలను అదుపు చేసుకొని, తోటి జీవుల సుఖదు:ఖాలలో తాదాత్మ్యం చెందగలగాలి. సర్వతోముఖమైన జాతీయ సమృద్ధికీ, వికాసానికీ, అవసరమైన సమరసతా, సమన్వయాలనూ, పరస్పర సహకార కృషినీ నిర్మించగల ఒకే ఒక సాధనం ఆత్మానుశాసనం.
ధర్మం పట్ల శ్రద్ధ, భగవంతుని పట్ల భక్తిభావం, పవిత్రమైన ఆలోచనలు ఉన్నప్పటికీ వెయ్యి సంవత్సరాల పాటు మనం విదేశీ దురాక్రమణదారులను ఎదిరించలేకపోవడానికి ఇదే కారణం. విదేశీయులు రజోగుణంతో మంచికి దూరంగా, వ్యవస్థీకృతంగా మనపై దాడులు చేసి ఆక్రమించుకున్నారు. మన చరిత్ర చెప్పే సత్యం ఏమిటంటే మన సమాజం ఎప్పుడైతే సత్వగుణంతో ఎదిరించి, పోరాడిందో అప్పుడు మనకు విజయం లభించింది. అధర్మ శక్తులన్నీ కుప్పకూలిపోయాయి.
పురాణాలలో కూడా దైవీ, రాక్షస శక్తుల మధ్య జరిగిన పోరాటం ద్వారా మనకు ఇదే గుణపాఠం లభిస్తుంది. అనేక శక్తులు వున్నప్పటికీ దేవతలు, వ్యూహాత్మకంగా దాడి చేసినా కూడా రాక్షసుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. ధైర్యంగా పోరాడినప్పుడు అసుర శక్తులపై వారికి విజయం లభించింది. ఈ ప్రపంచాన్ని ధైర్యవంతులు, శక్తిమంతులు, క్రియాశీలురు మాత్రమే శాసిస్తారన్నది వాస్తవం. ‘‘వరీభోగ్యా వసుంధరా’’ అన్న నానుడి తెలిసిందే. ధైర్యవంతులే ఈ భూమిని ఏలుతారు. ఈ ప్రపంచంలో వారే నిజమైన విజేతలు.