హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మొదట ఉప రాష్ట్రపతి పోలీసు అమరవీరుల స్మృతి స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. హైదరాబాద్ సంస్థాన విమోచనం, భారత్ లో విలీనం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించేందుకే ఈ కార్యక్రమమని తెలిపారు. హైదరాబాద్ విమోచన పోరాటంలోని మరుగునపడిన వీరుల కథలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు.ఈ పోరాటం కేవలం ప్రభుత్వాలు, నాయకులకు సంబంధించిన విషయం కాదని, ఇది ప్రజా ఉద్యమమని అభివర్ణించారు.
మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. అనేక మంది జైలు శిక్షలు, హింస, వ్యక్తిగత ఇబ్బందులను కూడా ఈ పోరాటంలో ఎదుర్కొన్నారన్నారు. రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ తదితరుల వీరుల త్యాగాలను జాతీయ స్మృతిలో గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత దేశ ఏకీకరణలో పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. బలమైన, ఏకీకృత భారత దేశానికి పటేల్ దృఢమైన పునాది వేశారన్నారు. హైదరాబాద్ ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి అపారమన్నారు.
ఇక.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ హైదరాబాద్ - జోధ్ పుర్ కి మధ్య విడదీయరాని బంధం వుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో తాను జోధ్ పుర్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. ఇక్కడ నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక మంది యోధులు పోరాటం చేశారన్నారు. స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం ఎంతో పోరాటం చేసి, తెలంగాణను భారత్ లో కలిపేందుకు కలిపేందుకు కృషి చేశారన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2029 లో గ్రామ గ్రామన ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.