తొలేం వంశ పుట్టుపూర్వోత్తరాలు, పూజా విధానాలపై SSA&IRI అధ్యయనం

VSK Telangana    21-Sep-2026
Total Views |
 
vamsham
 
మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలోని శ్రీ గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయాన్ని మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ తరహాలో పునర్నిర్మాణం చేసే దిశగా పరిశోధన మరియు క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించారు.
 
సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SSA&IRI) డైరెక్టర్ శ్రీ కాక నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ శ్రీ బుగ్గ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశోధనా బృందం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యం ఉన్న పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
 
ఈ సందర్భంగా 7వ గట్టు ఆర్తి బిడ్డ శ్రీ సకినం శ్రీనివాస్ సహకారంతో తొలేం వంశస్థుల పుట్టుపూర్వోత్తరాలు, వంశపారంపర్య ఆచారాలు, పూజా విధానాలు, సంప్రదాయాలు, గుంజేడు ముసలమ్మ తల్లి పూర్వ చరిత్రకు సంబంధించిన అంశాలపై ఆయా వంశస్థులతో క్షుణ్ణంగా చర్చించారు.
 
డైరెక్టర్ శ్రీ కాక నర్సింగరావు గుంజేడు ముసలమ్మ తల్లి పూర్వ చరిత్ర, స్థానిక ప్రజల ఆచారాలు, విశ్వాసాలు, తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.జాయింట్ డైరెక్టర్ బుగ్గ కోటేశ్వరరావు తొలేం వంశ పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక నేపథ్యం, వంశపారంపర్య సంప్రదాయాలు, ముసలమ్మ తల్లి ఆరాధనతో తొలేం వంశానికి ఉన్న సంబంధాలపై అధ్యయనం చేశారు.
 
పరిశోధనలో భాగంగా స్థానిక గ్రామ పెద్దలు, ఆలయ పూజారులు, తొలేం వంశీయులు మరియు సంప్రదాయాలపై అవగాహన ఉన్న వ్యక్తుల నుంచి మౌఖిక చరిత్ర, ఆచారాలు, విశ్వాసాలు, పూజా పద్ధతులు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.అలాగే ముసలమ్మ తల్లి చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలు, మౌఖిక సంప్రదాయాలు, మానవశాస్త్ర సమాచారాన్ని సమన్వయం చేసి మరింత సమగ్ర పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధనా బృందం గుర్తించింది.అనంతరం దేవాలయ ఈఓ, చైర్మన్, ముసలమ్మ తల్లి ఆలయ పూజారుల సమక్షంలో పరిశోధనా బృందం బట్టోని బయలు ప్రాంతాన్ని సందర్శించింది. అక్కడి స్థానిక చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిశీలించి సంబంధిత సమాచారాన్ని సేకరించింది.
 
ఈ పరిశోధనా కార్యక్రమంలో రీసెర్చ్ టీం కోఆర్డినేటర్ శ్రీ సోడె శ్రీరామ్, పరిశోధనా బృందం సభ్యులు కోర్నిబెల్లి సందీప్, కోరం లక్ష్మణ్, కోర్నిబెల్లి వినయ్ కుమార్, కుంజా కృష్ణ, ఇర్ప ప్రభాకర్, కాక స్వాతి పాల్గొన్నారు. పరిశోధనా బృందానికి సహకరిస్తున్న శ్రీ సకినం శ్రీనివాస్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
గుంజేడు ముసలమ్మ తల్లి చరిత్ర, ఆరాధనా పూజా సంప్రదాయాలు, తొలేం వంశానికి సంబంధించిన చారిత్రక అంశాలు, స్థానిక గిరిజన సంస్కృతికి సంబంధించిన ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసి, భవిష్యత్ తరాలకు భద్రపరిచే దిశగా పరిశోధన కొనసాగుతుందని SSA&IRI పరిశోధనా బృందం తెలిపింది.పరిశోధనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి/సంబంధిత అధికారులకు అందజేస్తామని పరిశోధనా బృందం వెల్లడించింది.