కొచ్చి : సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించి, వారితో కలిసి పనిచేస్తూ, వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడం అన్న దానిని సేవా భారతి లక్ష్యంగా పెట్టుకుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సేవా భారతి సంయుక్త మహా మంత్రి విజయ్ పురాణిక్ అన్నారు. ఈ లక్షణాలతో పాటు ప్రజల్లో దేశ భక్తి భావనను పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాలతో సామాజిక పరివర్తనను సాధించాలన్నది కూడా లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కేరళలోని ఇరింజలకుడలో సేవా భారతి కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది.
సేవా కార్యక్రమాలు కేవలం ప్రాణాలను కాపాడటానికే పరిమితం కాకూడదని, అవి 'జీవన నిర్మాణం' – అంటే జీవితాలను తీర్చిదిద్ది, వాటిలో సానుకూల మార్పును తీసుకురావడం – పై కూడా దృష్టి సారించాలని సూచించారు. సేవా భారతి కార్యకర్తలందరూ ఇదే లక్ష్యంతో పనిచేయాలని, సేవా కార్యక్రమాల ద్వారా శాశ్వతమైన, సానుకూల మార్పును తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో రాష్ట్రీయ సేవాభారతి కేరళ ఉపాధ్యక్షుడు పి.కె. ఉన్నికృష్ణన్, కార్యదర్శి సతీష్ జి., రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజీవ్ జి., ఇరింజలకుడ సేవాభారతి అధ్యక్షుడు నలిన్ బాబు, సేవాభారతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సనీష్ పాల్గొన్నారు.