హిందువుల లక్ష్యంగా తైమూర్ క్రూర దండయాత్ర

VSK Telangana    29-Sep-2026
Total Views |

taimur
భారతదేశ మధ్యయుగ చరిత్రలో దారుణ రక్త కన్నీటిని మరిపించిన ఘోర దండయాత్రలలో అమీర్ తైమూర్ చేసిన దాడి అత్యంత దుర్మార్గమైనది. కేవలం రాజకీయ సామ్రాజ్య విస్తరణ, సంపద దోపిడీ మాత్రమే కాకుండా, తైమూర్ తన దండయాత్రను ఒక మత యుద్ధంగా ప్రకటించుకున్నాడు. హిందువులు, వారి సంస్కృతి, దేవాలయాలను పూర్తిగా అణచివేయడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అతను సాగించిన మారణహోమం మానవ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.
 
తైమూర్ తాను రాసుకున్న ఆత్మకథ 'తుజుక్-ఇ-తైమూరి'లో తన దండయాత్రకు అసలు కారణాన్ని దాచుకోలేదు. భారతదేశంలో ఉన్న కాఫిర్లు అనగా హిందువులు విగ్రహారాధన చేస్తుండటాన్ని, ఇస్లాం శత్రువులైన హిందూ రాజులను అక్కడి ముస్లిం సుల్తానులు అడ్డుకోలేకపోతున్నారని ఆరోపించాడు. హిందువులను అణచివేయడం, వారి దేవాలయాలను కూల్చడం ద్వారా ఇస్లాం మతాన్ని ప్రతిష్టించడమే తన ప్రధాన కర్తవ్యంగా తైమూర్ చెప్పుకున్నాడు. దారి పొడవునా హిందువుల సంస్కృతి, నమ్మకాలను అణగదొక్కడానికి అతను తన సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు.
 
 
తైమూర్ భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి హిందువులను బందీలుగా పట్టుకుంటూ వచ్చాడు. ఢిల్లీకి సమీప ప్రాంతానికి చేరుకునేసరికి అతని శిబిరంలో దాదాపు లక్ష మంది హిందూ ఖైదీలు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్‌తో నిర్ణాయక యుద్ధం జరిగే సమయంలో ఈ హిందూ ఖైదీలు తమపై తిరుగుబాటు చేస్తారనే భయంతో తైమూర్ ఒక రాక్షస నిర్ణయం తీసుకున్నాడు. తన మత గురువుల అనుమతితో, ఆ క్షణంలోనే తన శిబిరంలో ఉన్న నిరాయుధులైన ఆ లక్ష మంది హిందువులను అత్యంత క్రూరంగా నరికి చంపాలని ఆదేశించాడు. ఈ దుర్ఘటనను తైమూర్ గర్వంగా తన ఆత్మకథలో రాసుకుంటూ, ఆ రోజు నా శిబిరంలో ఉన్న లక్ష మంది అవిశ్వాసులను అనగా హిందువులను చంపడం జరిగింది అని పేర్కొన్నాడు.
 
తైమూర్ సైన్యం ఏ పట్టణం లేదా గ్రామం గుండా వెళ్లినా, అక్కడ ఉన్న హిందూ దేవాలయాలను నేలమట్టం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం వారి దైనిక కార్యక్రమంలో భాగంగా ఉండేది. హిందువుల పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంలో తైమూర్ సైనికులు ఆనందం పొందారు. దేవాలయాల్లో ఉన్న నిధి నిక్షేపాలు, బంగారు, వెండి విగ్రహాలను దోచుకుని, గుళ్లను అగ్నికి ఆహుతి చేశారు. లక్షలాది మంది అమాయక హిందూ సన్యాసులు, బ్రాహ్మణులు, సామాన్య ప్రజలు ఈ మతపిశాచి దాడుల్లో బలయ్యారు.
 
యమునా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో తుగ్లక్ సైన్యాన్ని ఓడించిన తర్వాత తైమూర్ సైనికులు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించారు. ఢిల్లీ ప్రజలు తమ ప్రాణాలు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తిరగబడినప్పుడు, తైమూర్ మరింత క్రూరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ప్రతి హిందువును విచక్షణా రహితంగా నరికివేయాలని, నగరంలోని ప్రతి వీధిని రక్తంతో తడిపేయాలని ఆదేశించాడు. చారిత్రక ఆధారాల ప్రకారం, పదిహేను రోజుల పాటు ఢిల్లీ, సిరి, జహాన్‌పనా నగరాలు రక్తసిక్తమయ్యాయి. ఇళ్లలోని మహిళలు, పిల్లలు, వృద్ధులను కూడా వదలకుండా ఊచకోత కోశారు. ఆ తర్వాత మీరట్, హరిద్వార్ వైపు వెళ్లిన తైమూర్, హరిద్వార్‌లో పవిత్ర కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన వేలాది మంది హిందూ యాత్రికులపై అకస్మాత్తుగా దాడి చేసి గంగా నది తీరాన్ని రక్తంతో ఎర్రగా మార్చేశాడు.
 
ఈ ఘోరమైన దండయాత్ర, అలాగే లక్ష మంది హిందువుల ఊచకోత కేవలం ఒక ప్రాంతీయ కథనం కాదు; దీనికి తిరుగులేని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తైమూర్ కాలంలో పర్షియన్ భాషలో రాసిన 'తుజుక్-ఇ-తైమూరి', అలాగే షరఫుద్దీన్ యాజ్దీ రాసిన 'జఫర్ నామా' వంటి ప్రాచీన గ్రంథాలలో ఈ మారణహోమం స్పష్టంగా నమోదైంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ చరిత్రకారుడు మేజర్ చార్లెస్ స్టీవర్ట్ ఈ పర్షియన్ గ్రంథాలను తొలిసారిగా ఆంగ్లంలోకి అనువదించారు. ఆ తర్వాత ప్రముఖ చరిత్రకారులు హెన్రీ మియర్స్ ఎలియట్, జాన్ డౌసన్ కలిసి 'ది హిస్టరీ ఆఫ్ ఇండియా, యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టోరియన్స్' సంపుటాలలో వీటిని పొందుపరిచారు. ఈ బ్రిటిష్ అనువాదాల ద్వారానే తైమూర్ శిబిరంలో లక్ష మంది హిందువులు హత్యకు గురైన వైనం, దేవాలయాల ధ్వంసం వంటి సత్యాలు ప్రపంచానికి స్పష్టంగా తెలిశాయి.
 
భారతదేశ సంపదను దోచుకోవడంతో పాటు, హిందువుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని, వారి మత విశ్వాసాలను కాలరాయాలని తైమూర్ చేసిన ఈ దండయాత్ర దేశ చరిత్రలో ఎన్నడూ మరువలేని ఒక భయానక విషాదం. హిందువుల పట్ల అతను చూపిన మత విద్వేషం, సామూహిక హత్యలు మధ్యయుగాల నాటి మత దురహంకారానికి పరాకాష్టగా నిలిచాయి.