ఇందిరా పార్క్ వద్ద ABVP "ఫీజు దీక్ష"విజయవంతం

VSK Telangana    04-Sep-2026
Total Views |
 
abvp
 
హైదరాబాద్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఫీజు దీక్ష పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందని గత నాలుగైదు సంవత్సరాలుగా స్కాలర్ షిప్పులు విడుదల కాక విద్యాసంస్థలు మూతపడుతూ ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయన్నారు.
 
గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యా ప్రమాణాల నాణ్యత తగ్గిన కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నరన్నారు, రాష్ట్ర బడ్జెట్ నాలుగు లక్షల కోట్లు అయితే విద్యారంగానికి మేధావులు, విద్యావేత్తలు, విద్యా రంగ కమిషను,విద్యార్థి పరిషత్, అందరూ కూడా 18% బడ్జెట్ కేటాయించాలనీ విజ్ఞప్తి చేసినప్పటికీ కేవలం 8 శాతమే కేటాయించి విద్యారంగాన్ని విస్మరించిందన్నారు.
 
రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు తమ పట్టాలు చేతులు పట్టుకొని తిరుగుతున్నారని, వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందని కాబట్టి విద్యారంగ బడ్జెట్ పెంచి నిరుద్యోగ సమస్యను రూపుమాపాలన్నారు, లేకపోతే ఏబీవీపీ ఉద్యమ దెబ్బ ఎలా ఉంటుందో చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
 
అవసరమైతే ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు ఏబీవీపీ ఉద్యమ స్ఫూర్తిని అడిగి తెలుసుకోవాలని లేదంటే "జై జై తెలంగాణ బాయ్ బాయ్ కేసీఆర్" అంటూ కేసీఆర్ ను ఎలాగైతే గద్దే దింపమో, "జై జై తెలంగాణ బాయ్ బాయ్ కాంగ్రెస్, మరియు రేవంత్" అంటూ గద్దె దించాల్సిన సమయం వస్తుందని హెచ్చరించారు.

abvp1 
ఏబీవీపీ క్షేత్ర సంఘటన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కే.జీ నుండి పీ.జీ వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరినీ మోసం చేస్తున్నది. ఎన్నికల సమయంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చాక HCU యూనివర్సిటీ భూములను అమ్మే ప్రయత్నం చేస్తే విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అంతా కలిసి ఉద్యమం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ర కాల్సి వాత పెట్టడం జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులు స్కాలర్షిప్ పథకంతో చదువుకొని అనేక రంగాల్లో స్థిరపడి వారు రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆర్థిక భారంగా చూస్తూ ఈ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నదన్నారు.
 
ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ"తెలంగాణ రాష్ట్రంలో SC,ST,BC,EBC,మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని,తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా,సామాజికంగా ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని,ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తోనే ఫీజు దీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

abvp12 
 
రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు.పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, విద్యార్థి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించబోమన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ ABVP బాసటగా నిలుస్తుందని హామీనిచ్చారు.ఫీజు దీక్ష ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.