సంగారెడ్డి : చిట్కుల్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో బైబిల్ పఠనం ఒత్తిడిపై ‘‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’’ స్పందించింది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. విద్యార్థుల స్వేచ్ఛకు, వారు ఎంచుకున్న మతాన్ని విశ్వసించే, ఆచరించే స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తున్న అధికారులపై, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా క్రైస్తవ మిషనరీ సంస్థలపై కూడా నిష్పాక్షిక విచారణ కూడా జరపాలని, బాధ్యులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇతర సాంఘిక సంక్షేమ వసతి విద్యా సంస్థలలో కూడా ఇలాంటి పద్ధతులే జరుగుతున్నాయేమోనని పరిశీలించాలని, అలాగే ఇందులో ఏదైనా బయటి శక్తులు, మిషనరీ, ప్రభుత్వేతర లేదా విదేశీ నిధులతో నడిచే సంస్థల ప్రమేయం ఉందేమోనని, వాటి పాత్ర, పరిధితో సహా దర్యాప్తు చేయాలని తాము ఎన్‌హెచ్‌ఆర్‌సిని కోరినట్లు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఎక్స్ లో పేర్కొంది.
అసలు ఏం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బైబిల్ పఠనం, ప్రార్థనల వ్యవహారం వివాదంగా మారింది. విద్యార్థినులతో బలవంతంగా ప్రార్థనలు చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల బెడ్లపై బైబిల్ పుస్తకాలు కనిపించడంతో అధికారులను ప్రశ్నించారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా సీనియర్లు.. జూనియర్లతో బలవంతంగా బైబిల్ చదివిస్తున్నారని తెలిసింది. అసలు విద్యా సంస్థలోకి బైబిల్ ఎలా వచ్చింది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.