ప్లాస్టిక్ వాడకం ఆధునిక మానవ జీవితానికి వరంగా మారిన శాపం. ప్రతిరోజూ ఉదయం పళ్ళు తోముకునే బ్రష్ నుండి, తాగే నీటి సీసా, తినే ఆహారపు ప్యాకెట్ల వరకు ప్రతిచోటా ప్లాస్టిక్ సామ్రాజ్యమే నడుస్తోంది. ఈ ప్లాస్టిక్ కేవలం పర్యావరణాన్ని మాత్రమే కాదు, నిశ్శబ్దంగా మానవ జాతి మనుగడను, భవిష్యత్తు తరాల పుట్టుకను సైతం అంతం చేస్తోందని ఆధునిక వైద్య పరిశోధనలు షాకింగ్ నిజాలను వెల్లడిస్తున్నాయి. ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరినప్పుడు అది ఒక వ్యర్థ పదార్థంగా మిగిలిపోకుండా, హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా హైజాక్ చేసి, పురుషులలోనూ, స్త్రీలలోనూ సంతాన సామర్థ్యాన్ని నాశనం చేస్తోంది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అధ్యయనాలు ప్లాస్టిక్ వల్ల వచ్చే వంధ్యత్వ ముప్పును క్లినికల్‌గా నిరూపించాయి
.ప్లాస్టిక్ వస్తువుల తయారీలో సాగే గుణం కోసం, గట్టిదనం కోసం బిస్ ఫినాల్ ఏ (BPA), థాలేట్స్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎండోక్రైన్ డిస్రప్టర్స్‌గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో సహజంగా ఉండే ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి లైంగిక హార్మోన్లను అనుకరిస్తాయి. దీనివల్ల మెదడు గందరగోళానికి గురై, అసలైన హార్మోన్ల విడుదలను నిలిపివేస్తుంది లేదా తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తి ప్రక్రియను మొదటి దశలోనే దెబ్బతీస్తుంది.ఇటీవలి కాలంలో మగవారిలో వంధ్యత్వ సమస్యలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్లాస్టిక్ ప్రధాన కారణం అవుతోంది. ప్లాస్టిక్ రసాయనాల ప్రభావం వల్ల వీర్యకణాల సంఖ్య వేగంగా పడిపోతుంది. వాటి కదలిక సామర్థ్యం, ఆకృతి కూడా దెబ్బతింటాయి. శాస్త్రవేత్తలు జరిపినపరీక్షల్లో మానవ వృషణాలలో మైక్రోప్లాస్టిక్ కణాలు పేరుకుపోతున్నట్లు తేలింది. ఇది టెస్టోస్టెరాన్ (మగ హార్మోన్) ఉత్పత్తిని తగ్గించి, పురుషులలో నపుంసకత్వానికి దారితీస్తుంది.
ప్లాస్టిక్ రసాయనాలు మహిళల పునరుత్పత్తి అవయవాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. థాలేట్స్ వంటి రసాయనాలు అండాశయం పనితీరును దెబ్బతీసి, ఆరోగ్యకరమైన అండాలు విడుదల కాకుండా అడ్డుకుంటాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, పిసిఓడి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో ప్లాస్టిక్ రసాయనల మోతాదు ఎక్కువైతే గర్భం నిలవడం కష్టమవుతుంది. ఒకవేళ నిలిచినా తొలి నెలల్లోనే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.గర్భవతులుగా ఉన్న మహిళలు ప్లాస్టిక్ పాత్రలు, బాటిళ్లను ఎక్కువగా వాడటం వల్ల ఆ ప్రభావం గర్భంలోని పిండంపై పడుతుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలోకి చేరే బీపీఏ రసాయనం, పుట్టబోయే మగపిల్లల పునరుత్పత్తి వ్యవస్థను వారు గర్భంలో ఉన్నప్పుడే దెబ్బతీస్తుందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక వంధ్యత్వ సమస్యలను ఎదుర్కొనే ముప్పు ఉంటుంది
ప్లాస్టిక్ బాటిళ్లలో తాగే నీరు, ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచే ఆహారం ద్వారా ప్రతిరోజూ వేల సంఖ్యలో కంటికి కనిపించని మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహించి గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులు, వృషణాల కణజాలాలలో పేరుకుపోయి శాశ్వత వంధ్యత్వానికి కారణమవుతున్నాయి.ఈ సమస్య నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ప్లాస్టిక్ కవర్లలో లేదా డబ్బాలలో వేడి వేడి అన్నం, కూరలు, టీ, కాఫీ వంటివి అస్సలు తీసుకోకూడదు. వేడి తగలగానే ప్లాస్టిక్‌లోని విష రసాయనాలు ఆహారంలో సులభంగా కలిసిపోతాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులు రాగి, స్టీల్, మట్టి సీసాలను వాడటం ఎంతో మంచిది. ఆహార నిల్వకు గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ డబ్బాలను ఉపయోగించాలి. మైక్రోవేవ్ సేఫ్ అని రాసి ఉన్నప్పటికీ ప్లాస్టిక్ గిన్నెలను మైక్రోవేవ్ ఓవెన్లలో పెట్టి ఆహారాన్ని వేడి చేయకూడదు. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించడం ద్వారా మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తు తరాల సంతాన సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు