ఉదయాన్నే కళ్ళు తెరవగానే చేతికి అందే టూత్‌బ్రష్ నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఒంటిపై కప్పుకునే బెడ్‌షీట్ వరకు.. నిలువెల్లా ప్లాస్టిక్ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఒకప్పుడు ప్లాస్టిక్ మన జీవితాలను సులభతరం చేసే అద్భుత ఆవిష్కరణ అనుకున్నాం, కానీ నేడు అది మన ఉనికికే ముప్పుగా మారి మన శరీరంలో ఒక భాగమై కూర్చుంది. మనం తినే ప్రతి ముద్దలో, తాగే ప్రతి చుక్క నీటిలో, పీల్చే ప్రతి శ్వాసలో మనకు తెలియకుండానే ప్లాస్టిక్ విషాన్ని నమిలి మింగేస్తున్నాం. ఇదొక నిశ్శబ్ద విప్లవంలా మన ప్రాణాలను లోలోపలే హరిస్తోంది. ఆధునిక మానవుడు ప్లాస్టిక్‌ను సృష్టించాడు, కానీ ఇప్పుడు అదే ప్లాస్టిక్ మానవుడిని శాసిస్తూ, అతని జీవక్రియలను సర్వనాశనం చేస్తోంది. మనం ప్లాస్టిక్‌ను వాడుతున్నామని అనుకుంటున్నాం, కానీ నిజానికి ప్లాస్టిక్ మనల్ని మింగేస్తోంది.
మనం రోజువారీ జీవితంలో ఎంత ప్లాస్టిక్ తింటున్నామో ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఒక సగటు మనిషి ప్రతి వారం సుమారు ఐదు గ్రాముల బరువున్న మైక్రోప్లాస్టిక్‌ను శరీరంలోకి పంపుతున్నాడు. అంటే మనం వారానికొక డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను నమిలి మింగేస్తున్నామన్నమాట. ఒక రోజు లెక్కన చూస్తే వందలాది ప్లాస్టిక్ మైక్రోకణాలు, నానోకణాలు మన జీర్ణవ్యవస్థలోకి వెళ్తున్నాయి. సంవత్సరానికి ఇది దాదాపు పావు కిలో ప్లాస్టిక్‌కు సమానం. మనం మార్కెట్ నుండి తెచ్చుకునే ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లలో వేడివేడిగా ప్యాక్ చేసే సాంబార్, చాయ్, చట్నీ లేదా బిర్యానీ వంటివి ఈ విషాన్ని నేరుగా మన పొట్టలోకి చేరుస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో అధిక ఉష్ణోగ్రత కలిగిన ఆహారాన్ని ఉంచినప్పుడు, రసాయన బంధాలు విడిపోయి బిలియన్ల కొద్దీ నానో కణాలు ఆహారంలో కలిసిపోతాయి.
ఈ కథ ఇక్కడితో ఆగదు, గ్లోబల్ ఫుడ్ చైన్ అంటే, ప్రపంచవ్యాప్తంగా ఆహార గొలుసు మొత్తం ప్లాస్టిక్ మయమైపోయింది. సముద్రాలలో, నదులలో పేరుకుపోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సూర్యరశ్మి, నీటి అలల తాకిడికి గురై చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. వీటిని సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు ఆహారంగా భ్రమిస్తూ తింటున్నాయి. ఆ సముద్రపు ఆహారాన్ని మనుషులు మహా ఇష్టంగా వండుకుని తినడం వల్ల ఆ విష వలయం తిరిగి మన దగ్గరకే వచ్చి పూర్తవుతోంది. కేవలం మాంసాహారులకే కాదు, శాఖాహారులకు కూడా ఈ ముప్పు తప్పడం లేదు. మనం నిత్యం వాడే సముద్రపు ఉప్పులో, వ్యవసాయానికి వాడే భూగర్భ జలాలలో, చివరికి మనం తినే ఆకుకూరలు, కూరగాయల వేర్ల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్స్ మొక్కల లోపలికి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో వచ్చే పాలు, పెరుగు, పండ్ల రసాలు కూడా ఈ కాలుష్యానికి మినహాయింపు కాదు.
ఈ మైక్రోప్లాస్టిక్స్ కేవలం కడుపులోకి వెళ్ళి మలం ద్వారా బయటకు వచ్చేయడం లేదు. ఇక్కడే అసలైన పర్యావరణ, ఆరోగ్య రక్షసత్వ భయం దాగుంది. కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ నానో కణాలు మన ప్రేగుల గోడలను దాటుకుని, నేరుగా రక్తప్రవాహంలో కలిసిపోతున్నాయి. రక్తం ద్వారా ఇవి శరీరంలోని ప్రతి అవయవానికి ప్రయాణిస్తున్నాయి. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, గుండె.. చివరికి గర్భంలోని శిశువుకు రక్షణగా ఉండే జరాయువు (Placenta)లోకి, తల్లి పాలలోకి కూడా ఇవి చొరబడుతున్నాయని మెడికల్ జర్నల్స్ ఘోషిస్తున్నాయి. దీనివల్ల మానవ శరీరంలో హార్మోన్ల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. పురుషులలో వంధ్యత్వ సమస్యలు, స్త్రీలలో థైరాయిడ్, పీసీఓడీ వంటి రుగ్మతలు పెరిగిపోవడానికి ఈ ప్లాస్టిక్‌లోని థాలేట్స్, బిస్‌ఫెనాల్ ఎ... కారణమని తేలింది. ఇవి కణాల స్థాయిని మార్చేసి, రోగనిరోధక శక్తిని క్షీణింపజేసి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి.
ఈ భయంకరమైన ప్లాస్టిక్ పాయిజన్ నుండి మనం రాత్రికి రాత్రే పూర్తిగా తప్పించుకోలేకపోయినా, మన దైనందిన అలవాట్లను స్పృహతో మార్చుకోవడం ద్వారా దీని తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా రాగి, స్టీల్, గాజు లేదా సాంప్రదాయ మట్టి పాత్రలలో నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. వంటగదిలో వేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో, మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పే ప్లాస్టిక్ పాత్రలలో వేడి చేయడం పూర్తిగా మానేయాలి. బట్టల ఎంపికలో పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్ వంటి సింథటిక్ వస్త్రాలను పక్కన పెట్టి, 100% ప్యూర్ కాటన్, లినెన్, ఖాదీ దుస్తులను, బెడ్‌షీట్లను ఎంచుకోవాలి. ఎందుకంటే సింథటిక్ దుప్పట్లను వాడినప్పుడు వాటి ఘర్షణ వల్ల రాలిన మైక్రోఫైబర్స్ గాలిలో తేలుతూ మనం పడుకున్నప్పుడు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. అలాగే ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌ల స్థానంలో వెదురు బ్రష్‌లను, ప్లాస్టిక్ వంటగది సామాగ్రికి బదులుగా చెక్క, ఇనుము లేదా స్టీల్ వస్తువులను వాడటం ఒక మంచి ప్రత్యామ్నాయం.
ప్రకృతిని మనం ప్లాస్టిక్‌తో ఎంతగా కలుషితం చేశామో, ఇప్పుడు అదే ప్రకృతి మనకు ప్లాస్టిక్‌ను ఆహారంగా, శ్వాసగా మార్చి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తోంది. ఇది ప్రకృతి చేస్తున్న ప్రతికారం. ప్లాస్టిక్ కాలుష్యం అనేది కేవలం సముద్రాలకో, పర్యావరణానికో పరిమితమైన సమస్య కాదు; ఇది మన ప్లేట్లలోకి, మన రక్తనాళాల్లోకి చొరబడిన అంతర్గత యుద్ధం. రాబోయే తరాల భవిష్యత్తును, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ పట్ల మనకున్న మితిమీరిన వ్యామోహాన్ని వీడాలి. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం, ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం, ద్వారా మాత్రమే సహజసిద్ధమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మనం అడుగులు వేయగలం. మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇదే మన ముందున్న ఏకైక మార్గం.